అంతా అయిపోయాక మెగాస్టార్ హితబోధ!


‘మా’ ఎన్నికలు రాజకీయ నాయకుల ఎన్నికలని తలపించాయి. ఎమ్మెల్యే, ఎంపీగా పోటీచేసే వారు కూడా అన్ని ఆరోపణలు, తిట్లకు దిగారు. ఆ రేంజ్ లో విమర్శలు చేసుకున్నారు ‘మా’ ఎన్నికల్లో. నెల రోజులు పాటు ప్రచారంలో అన్ని హద్దులు దాటేశారు మన తెలుగు సినిమా నటులు. కానీ మెగాస్టార్ చిరంజీవి కానీ, ఇండస్ట్రీలో ఉన్న ఇతర సీనియర్ హీరోలు బాలయ్య, నాగార్జున, వెంకటేష్ కానీ ఎవర్నీ వారించలేదు.

విచిత్రంగా ఎన్నికలు పూర్తి అయిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి హితబోధ చేశారు. “పెళ్లి సందడి” అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రోజు హైదరాబాద్ లో జరిగింది. దీనికి వెంకటేష్, చిరంజీవి గెస్ట్ లుగా వచ్చారు.

“వెంకటేష్, నేను ఒకరినొకరు గౌరవించుకుంటాం. ఆయన నారప్ప చూసి నేను మాట్లాడాను. నా ‘సైరా” చూసి వెంకటేష్ నన్ను పొగిడాడు. హీరోల మధ్య మంచి స్నేహ బంధం ఉంది. పదవులు తాత్కాలికం. వాటి కోసం మనం మాటలు అనడం, అనిపించుకోవడం చూస్తుంటే బయటవారికి ఎంత లోకువ అయిపోతాం అనే బాధ నాలో ఉంది. ఏ ఒక్కరినో నిందించడం లేదు. ఎవరినీ కించపరచాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాను,” అని చిరంజీవి అన్నారు.

అంతా అయిపోయాక చిరంజీవి ఇప్పుడు హితబోధ చెయ్యడం దేనికి అన్న కామెంట్స్ పడుతున్నాయి. ఈ పనేదో ముందే చేసి ఉండొచ్చు కదా అని చిరంజీవికి కామెంట్స్ పెడుతున్నారు సోషల్ మీడియా ఫోక్స్.

Advertisement
 

More

Related Stories