-- రమణ ఈడూరి, సిలికాన్ వేలీ, క్యాలిఫోర్నియా (జూన్ 6, 2009)
జూన్ 6, శనివారం రాత్రి సన్నీవేల్ నగరంలో (పున్నమికి ఒక రోజు ముందర) గుడి బయటనే కాకుండా లోపలకూడా నిజంగా వెన్నెల కురిసింది!
తెలుగు చలన చిత్ర సంగీత ప్రపంచంలో ఎన్నెన్నో మధురమైన పాటలకి స్వరాలు సమకూర్చిన అలనాటి ప్రముఖ సంగీతదర్శకుడు
సత్యం
గారికి, సిలికాన్ వేలీలో స్వరనివాళి కార్యక్రమం నిర్వహించబడింది.
మూడు గంటలపాటు సాగిన ఈ స్వర మంత్రజాలం దాదాపు
వెయ్యిమంది
ప్రేక్షక శ్రోతల్ని ౩౦ సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళింది. అమెరికాలోని బే-ఏరియాలో
బాటా, చిమట మ్యూజిక్
సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం ఎన్నో విధాలుగా ప్రత్యేకతని సంతరించుకుంది. ప్రవాసాంధ్ర సంస్థలు ఒక తెలుగు సంగీత దర్శకుడికి నివాళిగా ఆయన పాడిన పాటలని ఆలపించడం ఒక ప్రత్యేకత. గాయనీ గాయకులంతా స్థానికులవడం ఇంకొక ప్రత్యేకత. వాయిద్య సంగీతాన్ని సమకూర్చిన కళాకారులంతా తమిళులవడం సంగీత ప్రపంచానికి ఎల్లలు లేవని మరోసారి నిరూపించింది. కేవలం ’సత్యం’ గారు స్వరపరచిన పాటలతోనే ఫూర్తి కార్యక్రమం విదేశాల్లో జరగడం బహుశ ఇదే మొదటి సారి కావొచ్చు.
ఈ కార్యక్రమానికి సన్నిధి రెష్టారెంట్ (ప్లెజంటన్) వారు గ్రాండ్ స్పాన్సర్ గా మరియు రవి ట్యాక్స్, శ్రీ ట్రావెల్స్, చానెల్ రియల్ ఎస్టేట్ వారు కో-స్పాన్సర్లుగా వ్యవహరించారు. ప్రసాద్ మంగిన (బాటా ప్రెసిడెంట్), వీరు ఉప్పాల (బాటా బోర్డ్), చిమట శ్రీనివాస్ గార్ల ఆధ్వర్యంలో బాటా & చిమటమ్యూజిక్ కార్యకర్తలు చాలా చురుగ్గా ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు. ఆసూరి విజయ గారు (బాటా బోర్డ్ & కల్చరల్ చెయిర్) వ్యాఖ్యాతగా ఆద్యంతం రక్తి కట్టించారు.
సాయంత్రం 6:30 నుండి రాత్రి 10:00 వరకు కార్యక్రమం కొనసాగింది. మొత్తం
26 ఆణిముత్యాలవంటి
పాటలను ఎంచుకొని పాడారు.
మరొక ముఖ్యాంశం ఏమిటంటే సుప్రసిద్ధ గాయకులు శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు మరియు ప్రముఖ Guitar వాద్యకారులు శ్రీ సాలూరి వాసు రావు గారు
(ప్రఖ్యాత సంగీత దర్శకులు కీర్తిశేషులు సాలూరి రాజేశ్వరరావు గారి కుమారుడు) నిర్వాహకుల ప్రయత్నాన్ని హర్షిస్తూ ప్రత్యేకించి ఈ కార్యక్రమంకోసమే రికార్డింగ్ చేసి పంపించిన వీడియోలను విరామ సమయానికి ముందు, తరువాత ప్రదర్శించారు. అందులో వారిద్దరు శ్రీ సత్యంగారితో తమకు గల అనుబంధాన్ని అనుభవాల్ని ప్రేక్షకులందరితో పంచుకున్నారు.
ఇంకొక ప్రత్యేకమైన ఆకర్షణ హాలు బయట పెట్టిన
Black and White Photos
.
చిమట శ్రీనివాసరావుగారు ఎక్కడినుండి తెచ్చారోగాని చాలా పాతవి అరుదైన సత్యం గారికి సంబందించిన ఫొటోలు ఎన్నో ఉన్నాయి. సత్యం గారు ప్రముఖ గాయనీగాయకులు, ఇంకా సంగీత దర్శకులు (ఉత్తరాదివారు కూడా) ఎందరితోనో కలిసి దిగిన ఫొటోలు ఆనాటి జ్ఞాపకాలను గుర్తుచేస్తూ కన్నులవిందు కలిగించాయి.
ముందుగా విజయ ఆసూరి గారు వేదికపైకి వచ్చి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సత్యంగారి
Background
ని ప్రేక్షకులకు పరిచయం చేస్తూ
గురించి కొద్దిసేపు మాట్లాడారు. ఎన్నో మధురమైన పాటలను మనకు అందించినా ఎంతో Talent కలిగివున్న వ్యక్తి అయినా ఆయనకు తగిన గుర్తింపు రాలేదన్నారు (నా మాటగా చెప్పాలంటే పాటచాతుర్యమున్నా మాటచాతుర్యం లేక ఆయనకు ఎటువంటి పురస్కారాలు లభించలేదు). అటువంటి మహానుభావుని గౌరవార్థం ఈ వేడుక తలపెట్టినందుకు చిమట శ్రీనివాసరావును అభినందించారు. తరువాత ముఖ్యగాయకుడు, కార్యనిర్వాహకుడు అయిన రవి గుడిపాటి గారిని వేదికపైకి ఆహ్వానించారు.
రవి గుడిపాటి గారి గురించి ఒక మాట చెప్పాలి. నేను ఇంతకు ముందు ఆయన పాటల గురించి విన్నానుగాని, పాటలను మాత్రం వినియుండలేదు! ఆయన పాడుతుంటే కొన్ని సందర్భాలలో సాక్షాత్తు బాలుగారే వచ్చి పాడిన అనుభూతి కలిగింది. ఇకపోతే Orchestra గురించి కూడా నేనొక ముక్క చెప్పాలి. అందులోని వారందరూ (సత్య వైద్యనాథన్, వెంకీ సుబ్రమణియం, కృష్ణమూర్తి కల్వై, బాలాజి మహదేవన్, అశ్విన్ కుమార్, మరియు శ్రీనాథ్ విశ్వనాథన్
)
తమిళులు. మన సత్యం గారు కన్నడవారికి తెలుసుగాని తమిళులకు తెలియదు. వీరెవరికీ ఈ పాటలతో పరిచయం లేకపోయినా నెల రోజులలో అభ్యసించి చక్కని వాద్యం అందజేశారు.
మున్ముందుగా ఆనవాయతీ ప్రకారం భక్తిగీతంతో ప్రారంభించారు. 'అల్లరిపిల్లలు' చిత్రంనుండి 'శ్రీచక్ర శుభనివాసా, స్వామి జగమేలు చిద్విలాసా' రవిగారు, యామిని పొట్టిగారు పాడితే మిగిలిన గాయినులు హేమ కోటా, సుధ శాస్త్రి, పద్మిని సరిపెల్ల గార్లు కోరస్ అందించారు.
తరువాత రవిగారు 'స్వప్న' చిత్రంనుండి 'అంకితం నీకే అంకితం' అనే పాట చాలా అద్భుతంగా పాడారు. ముఖ్యంగా ఈ పాటలో 'కాళిదాసు కలమందు చిందు అపురూప దివ్యకవితా' వంటి అనేక కవితావాక్యాలు ఉంటాయి. వాటిని స్వరానికి తగ్గట్టుగా పాడితే చాలా వినసొంపుగా ఉండింది. పాట కరతాళ ధ్వనులతో ముగిసింది. ఈ పాట తరువాత ప్రసాద్ దుర్వాసుల గారు యామినిగారితో కలిసి 'ఏ రాగమో ఇది ఏ తాళమో' అనే యుగళగీతం (చిత్రం అమరదీపం) ఆలపించారు.
గోదావరి తీరాన వెలిసిన రాజమహేంద్రి వైభవాన్ని వర్ణించడానికి వేయిమాటలు చాలవు కాని ఒక్క పాట చాలు. అదే ఆంధ్రకేసరి సినిమాలోని 'వేదంలా ఘోషించే గోదావరి, అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి'. ఈ పాటను మురళి సంబర గారు వచ్చి అభినయిస్తూ పాడుతుంటే చిన్నప్పుడు చూసిన వరదగోదావరి పరవళ్లు
గుర్తుకొచ్చాయి. అప్పుడే రవిగారికి ప్రేక్షకులు enjoy చేస్తున్నారా లేదా అనే సందేహం కలిగింది! అందుకని ఒక హుషారైన మత్తెక్కించే పాట అందుకున్నారు. సుధ గారితో కలిసి బుల్లెమ్మ బుల్లోడు లోని 'కురిసింది వానా నా గుండెలోనా' అని పాడి అందరి గుండెల్లో వానజల్లు కురిపించారు. ఈ పాటకు
Orchestra
వారు మంచి
Drumbeat
అందించారు.