Sunday, March 14, 2010
Telugucinema.Com
July 18 Feb 23
Stars : Star Profiles : జంధ్యాల గారికి నివాళి  
Star Profiles
Latest Headlines
Padmanabham is no more!
Gummadi passed away: A tribute
Hero Srikanth's Complete Filmography
Tribute: Late Sri Rajashri 1934-1994
సు'స్వరాల' మాల - పెండ్యాల
An acting legend's golden jubilee
Remembering D. Yoganand
మైఖేల్ జాక్సన్ కి నివాళి
జంధ్యాల గారికి నివాళి
Happy birthday, Balu!
Madhhurima - Chit Chat
Happy birthday, Super Star!
Tribute : Director G.Ramineedu passed away
Kantha Rao is no more
Tribute to Nirmalamma
Homage to Sree Gummuluru Sastry
Tribute: Sri Gummuluru Sastry passed away
Remembering B.N.Reddy
Priyamani Personal Side
Chakrapani: 100 years

Feb 18 Jan 28

జంధ్యాల గారికి నివాళి
Jun 20, 2009 - 5:04:19 PM
By శ్రీ మరియు నచకి
   

“జగమెరిగిన బ్రాహ్మణుడికి జంధ్యమేల!” అన్నట్టు జంధ్యాల గారి గురించి ప్రత్యేకంగా పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు. “ముద్దమందారం” చిత్రం విడుదల అయినప్పుడు బోలెడు విమర్శలు... యుక్తవసుయలోకి వస్తున్న యువతీయువకులని రెచ్చగొట్టేలా ఉంది అని. (విమర్శకులకి ఏం తెలుసు పాపం... అప్పటికి ఇరవై ఏళ్ళ తర్వాత రాబోయే ఓ దర్శకుడు పదే పదే ఇదే పనిగా “టీనేజ్ లవ్” మీద సినిమాలు తీసి జనాల మీదకి వదలబోతాడని!) ముసలివారి పడుచు ప్రేమలు చూసి విసుగెత్తిన అప్పటి జనాలకి అది చల్లని “జంధ్యామారుతం”లా అనిపించింది. “నాలుగు స్తంభాలాట”మొదలు తీసిన చిత్రాలలో పుష్కలంగా సెంటిమెంట్ ఉన్నా కాని హాస్యం బాగా పండింది. దానికి తోడు “అహ.. నా పెళ్ళంట!” వసూళ్ళలో పెద్ద చిత్రాలని మించిపోవడంతో ఆయన తర్వాత తీసిన చిత్రాలన్నీ అదే కోవలోకి వెళ్లి కొంత మూస పద్దతిలో కి వెళ్ళినట్టు ప్రేక్షకులు భావించారు. కానీ జంధ్యాల గారు తీసిన “ఆనందభైరవి”, “రెండు జెళ్ళ సీత”, “లేడీస్ స్పెషల్”, “నెలవంక”, “సత్యాగ్రహం” లాంటి చిత్రాలు చూసినవాళ్ళకి జంధ్యాల ఎంతటి ఆలోచనాపరుడో, ఎంతటి “సెన్సిటివ్” వ్యక్తో అర్థం అవుతుంది.
 
మొదట్లో భారతీరాజా ప్రభావంతో తీసినా తర్వాత తర్వాత ఆయన తనదైన సొంత బాణీలోకి వెళ్ళిపోయారు. “నెలవంక”, “ఆనందభైరవి”, “సత్యాగ్రహం”, “శ్రీవారికి ప్రేమలేఖ”, “చంటబ్బాయ్”, “పడమటి సంధ్యారాగం” లాంటి   చిత్రాలని ఆయన తప్ప ఇంకొకళ్ళు తీయలేరు అని అనడం అతిశయోక్తి కాబోదు. ఆయన పరిచయం చేసిన కొత్త నటీనటుల సంఖ్య కూడా తక్కువేమీ కాదు. నరేశ్, ప్రదీప్, పూర్ణిమ, రాజేష్, “సుత్తి” జంట, బ్రహ్మానందం, ధర్మవరపు సుబ్రహ్మణ్యం... ఇలా ఒక పెద్ద జాబితానే అవుతుంది! పొట్టి ప్రసాద్, శ్రీలక్ష్మి వంటి నటీనటులని ఒకే రకమైన characterization తోనే మళ్ళీ మళ్ళీ వాడుకున్నా, కోట శ్రీని వాసరావుని రకరకాల mannerisms తో ఎన్నో చిత్రాలలో వాడుకున్నా ఒక్క సారైనా విసుగు తెప్పించకుండా చిత్రాలని మలచగల నేర్పరితనం జంధ్యాలకే సొంతం! రాజేంద్రప్రసాద్, చంద్రమోహన్, నరేశ్ వంటి వారిని చిత్రరంగానికి తానుగా పరిచయం చేయకున్నా కథానాయకులుగా వారికి కొత్త బాణీ కల్పించి, బాలకృష్ణ, చిరంజీవి వంటి కమర్షియల్ హీరోలతో కూడా హాస్యప్రధానమైన చిత్రాలు తీసి, ఆఖరికి “తెరంగేట్రం” చేస్తున్న అమెరికన్ నటుడితోనూ, స్వతహాగా నటుడు కాని “డ్రమ్మర్” శివమణితోనూ కూడా హాస్యాన్ని పండించి సినిమాలలో “comedy” అన్న మాటకే సరికొత్త నిర్వచనం కల్పించిన 'హాస్యబ్రహ్మ' జంధ్యాల!
 
ఊరికే హాస్యం కోసమే హాస్యస్ఫోరక ప్రయోగాలు చెయ్యటం కాక అంతర్లీనంగా ఆయనలోని పాండితి, ఆవేదన అన్నీ తెలిసేవి జంధ్యాల రచనలో, చిత్రాల్లో. “ఈ వాక్యంలో 56 'క'లున్నాయి, కావాలంటే లెక్కెట్టుకో!” అని సవాల్ విసరగల “దమ్మున్న” రచయిత జంధ్యాల. తెలుగు భాషకు, అధ్యాపకులకు పడుతున్న దుస్థితిని “హై హై నాయకా!” చిత్రంలో నరేశ్ పాత్ర ద్వారానూ, “చూపులు కలసిన శుభవేళ” చిత్రంలో కోట శ్రీనివాసరావు పాత్ర ద్వారానూ చూపించినా, ఫక్తు హాస్యచిత్రంగా సాగే “చంటబ్బాయ్” చిత్రంలో అనాథలుగా వదిలివేయబడుతున్న బిడ్డల గురించిన ఆవేదనను జొప్పించినా, రకరకాల వ్యాపకాలతో, తదనుగుణమైన సాధనలతో శ్రీలక్ష్మి పాత్రల ద్వారా హాస్యం తుళ్ళించినా, ఎప్పుడూ ఎవరో ఒకరిని తిడుతూ ఉండే వాళ్ళని దెప్పుతూ “హై హై నాయకా!” చిత్రంలో కోట శ్రీనివాసరావును, “మొగుడూ పెళ్ళాలు” చిత్రంలో సుత్తి వీరభద్రరావును మలచినా అది జంధ్యాలకే చెల్లు! “అసలు జంధ్యాల మన పక్క ఇంట్లో ఉండి మన ఇంట్లో జరిగేవన్నీ వ్రాసుకుని తన సినిమాలలో పెట్టేస్తాడేమో!” అని హాస్యప్రియులకే కాక అందరికీ ఎప్పుడో ఒకప్పుడు అనుమానం వచ్చే ఉంటుంది కొన్ని పాత్రలు తెర మీద చూస్తున్నప్పుడు! అంతగా మన మనసుల్లో దూరి గిలిగింతలు పెట్టే ఆరోగ్యకరమైన హాస్యం కమర్షియల్ మూసలో కొట్టుమిట్టాడుతున్న తెలుగు సినిమాకి కొత్త ఊపిరులూదిందంటే కాదనేదెవరు!
 
తాను తీసినవి హాస్య చిత్రాలయినా, మరే రకమైన కోవకు చెందినవైనా జంధ్యాల చిత్రాలలో పాటలను ఎవరూ మరువలేరు! ఒక తెలుగు చలనచిత్రగీతం అమెరికాలో “రికార్డ్” అవ్వడం కూడా జంధ్యాల రికార్డే! “పడమటి సంధ్యారాగం” చిత్రంలోని “పిబరే రామరసం...” అన్న పాట ఆ చిత్ర సంగీత దర్శకుడైన ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో జరిగింది. (ఆనాడు సంగీత శాఖలోనే ఉండి రికార్డింగ్‌లో సహాయం చేసిన మాధవపెద్ది సురేశ్ ఆ తరువాత కాలంలో జంధ్యాల తీసిన “హై హై నాయకా!” చిత్రంతో సంగీతదర్శకునిగా పరిచయమయ్యారు.) జంధ్యాల ప్రతి చిత్రంలో ప్రేమ మీద పాట ఒకటి తప్పనిసరిగా ఉండేది. “ముద్దుకే ముద్దొచ్చే సింగారం...” (ముద్దమందారం), “తొలి చూపు  తోరణమాయె, కళ్యాణ  కారణమాయె...”, “సన్నజాజి  తీవెలలోనే  సన్నాయి...” (మల్లె పందిరి), “మందారంలో ఘుమఘుమనై...” (రెండు జెళ్ళ సీత), “పిలచిన మురళికి...” (ఆనందభైరవి), “కాస్తందుకో, దరఖాస్తందుకో...” (రెండు రెళ్ళు ఆరు)... ఇలా ఎన్నని చెప్పగలం! ప్రతి చిత్రంలో ఒక ప్రేమ పాట తప్పనిసరి మరి. “చూపులు కలసిన శుభవేళ” చిత్రంలో నయితే రెండు మగపాత్రలతో ప్రేమగీతం చిత్రీకరించి ఆశ్చర్యపరచటమే కాక ప్రజాదరణ పొందిన పాటని “remix” చేసి ఒప్పించి, మెప్పించగల సమర్థుడు జంధ్యాల! “చినుకులా రాలి...” (నాలుగు స్తంభాలాట) పాట చిత్రీకరణకి 140 షాట్స్ తీసారు! ఈయన ఏం తీస్తున్నారో తెలియక నిర్మాత ఒక రోజు పెద్ద గొడవే పెట్టేసుకున్నారు! (ఎడిటింగ్ అయ్యాక నాలుక కరుచుకున్నారనుకోండి, అది వేరే సంగతి.) అన్నమాచార్యుల జీవితం మీద చిత్రం తీయాలని జంధ్యాల అనుకుని పాటలన్నీ రికార్డ్ చేసినా ఆ ప్రయత్నం కొనసాగలేదు. కొన్ని సంవత్సరాల క్రితమే మార్కెట్‌లో లభ్యమవుతున్న ఆ పాటలు వింటే జంధ్యాల కృషి, తపన తెలుస్తాయి.
 
“ఆనందభైరవి” చిత్రంలో ఒక్కో పాట ఒక్కో అణిముత్యమే. “చైత్రము కుసుమాంజలి...”, “పిలచిన మురళికి...”, “కొలువైతివా రంగశాయి...” - ఇలా ఒక్కో పాట చిత్రీకరణలో అయన వాడిన శైలి ఎన్ని సంవత్సరాలైనా మరపు రాదు! “ఆనందభైరవి”లో ఒక్కో సన్నివేశం వెనుక ఎంత అర్థం ఉన్నదో చెప్పలేము! విడుదలయ్యాక ఘనవిజయం సాధించిన ఆ చిత్రానికి మొదట విడుదల హక్కులు కొనడానికి ఎవరూ ముందుకు రాలేదని (“శంకరాభరణం” చిత్రం లాగా) తెలిస్తే ఆశ్చర్యం వేస్తుంది! “శంకరాభరణం” తరువాత ఒక సినిమా యూనిట్ సభ్యులతో అమెరికాలో వేడుక జరపడం అన్నది “ఆనందభైరవి”కే. ఎన్ని సార్లు చూసినా  కొత్తగానే అనిపించి, విసుగు రాని చిత్రం “ఆనందభైరవి” అంటే తప్పు కాబోదేమో! ...ఇలా వ్రాసుకుంటూపోతే ఒక్క “ఆనందభైరవి” గురించే కాదు, జంధ్యాల తీసిన దాదాపు యే చిత్రం గురించైనా (చివరలో వచ్చిన “ఓహో, నా పెళ్ళంట!”, “విచిత్రం” వంటి కొన్ని మరచిపోదగ్గ చిత్రాలు మినహాయిస్తే) ఠావుల కొద్దీ వ్రాయవచ్చు! “కళాతపస్వి” విశ్వనాథ్ తీసిన శంకరాభరణం మార్కు చిత్రమైన “'ఆనందభైరవి' జంధ్యాల సినిమానా?” అని ఆశ్చర్యపోయేవారికి “శంకరభరణం” చిత్రానికి కూడా జంధ్యాల మాటలు వ్రాసారని తెలియకపోవచ్చు! అటువంటి కళాత్మక చిత్రాలకూ, తానే బాటే వేసిన హాస్యచిత్రాలకు మాత్రమే కాదు... జంధ్యాల కలం “వేటగాడు” లాంటి కమర్షియల్ చిత్రాలలోనూ తన వాడిని నిరూపించుకుంది!
 
సినిమా రచయితకి “స్టార్ స్టేటస్” తెచ్చి హాస్యాభిమానుల మనసుల్లో ఎంతో ఎత్తున స్థిరత్వాన్ని సంపాదించిన జంధ్యాల చిన్న వయసులోనే అందుకోలేని స్వర్గాలను చేరుకుని నేటికి సరిగ్గా ఎనిమిది సంవత్సరాలు. రచయితగానూ, ఉత్తమ సంగీతాభిరుచినీ, హాస్యాభిరుచీనీ కలిగిన దర్శకుడిగానూ, “ఆపద్బాంధవుడు” చిత్రంలో నటుడిగానూ కూడా తన బహుముఖప్రజ్ఞను ప్రదర్శించిన గురించి “మన” జంధ్యాల ఎంత రాసిన తక్కువే.

 

Article by Sri and NaChaKi

Comments

© Copyright by Telugucinema.com

  Comments

Top of Page




Web TC
Email login
PittsburghIndian.com
ClevelandIndian.net
ColumbusIndia.net
 

Copyright © 1997 - 2008 Telugucinema.Com. All rights reserved. Reproduction in whole or in part in any form or medium without express written permission of Telugucinema.Com is prohibited.

 
Home     News     Articles     Interviews     Box-office     Reviews     Schedules     Gallery     Blog