వెరైటీ కథలే చేస్తా: ఆనంద్ దేవరకొండ

Anand Deverakonda

“దొరసాని”, “మిడిల్ క్లాస్ మెలొడీస్” చిత్రాల్లో నటించిన ఆనంద్ దేవరకొండ ఇప్పుడు మూడో చిత్రంతో మన ముందుకొచ్చారు. 12న విడుదల కానుంది ఆయన నటించిన తాజా చిత్రం… “పుష్పక విమానం”.

పుష్పక విమానం ఎలా మొదలైంది?
దర్శకుడు దామోదర మా అన్నయకి ఫ్రెండ్. ఆయన చెప్పిన కథ నచ్చింది. ఈ కథని వేరే హీరోలతో నిర్మించాలని బరిలోకి దిగాం. కానీ “హీరో పెళ్ళాం లేచిపోతుంది” అనే కాన్సెప్ట్ కారణంగా వాళ్ళు అంతగా ఆసక్తి చూపలేదు. దాంతో, నేను నటించాల్సి వచ్చింది.

ట్రైలర్ బాగుంది. సినిమా అంతా కామెడిగానే ఉంటుందా?
నేను ఇందులో చిట్టిలంక సుందర్ అనే టీచర్ గా నడిచాను. పెళ్లయిన కొద్దీ రోజులకే భార్య లేచిపోతుంది. పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేక తనే వెతకడం ప్రారంభిస్తాడు. ఆ ప్రాసెస్ లో కొంత కామెడీ ఉంటుంది. ఐతే, సినిమాలో కామెడీ తో ఎమోషనల్ ఎలిమెంట్ కూడా ఉంది. “పుష్పక విమానం” సినిమాలో పెళ్లి గురించి ఓ మంచి విషయాన్ని చెప్పబోతున్నాం.

ఈ సినిమా మేకింగ్ లో మీ పాత్ర ఎంత?
సినిమా పూర్తయ్యాక కొన్ని పనుల్లో ఇన్వాల్వ్ అయ్యా గానీ, సినిమా మేకింగ్ టైమ్ లో ఎక్కడా జోక్యం చేసుకోలేదు. దర్శకుడి తాను అనుకున్నది అనుకున్నట్లు తీశారు. అన్నయ్య విజయ్ కి సినిమా బాగా నచ్చింది. అందుకే ఈ సినిమాను బాగా ప్రమోట్ చేద్దామని ముందుకొచ్చాడు. తన సినిమాల పనుల్లో బిజీగా ఉన్నా, పుష్పక విమానం ప్రమోషన్ కు వీలైనంత టైమ్ ఇచ్చాడు.

సినిమా ఎందుకు లేట్ అయింది?
కరోనా వల్ల పుష్పక విమానం సినిమా విడుదల ఆలస్యమైంది. “మిడిల్ క్లాస్ మెలొడీస్” కూడా పాండమిక్ వల్ల డైరెక్ట్ ఓటీటీ కి వెళ్లింది. ఈ సినిమాకు అదే జరుగుతుందా అని భయపడ్డాం. ఆలస్యమైనా థియేటర్లలో రిలీజ్ అవుతుండటం హ్యాపీగా ఉంది.

మీ సినిమాల ఎంపికలో మీ అన్నయ పాత్ర ఎంత?
నా కథల ఎంపికలో అన్నయ్య ప్రమేయం ఉండదు. నేనే సెలెక్ట్ చేసుకుంటా. ఈ సినిమా విడుదల తర్వాత కేవీ గుహన్ గారి దర్శకత్వంలో ఒక మూవీ వస్తుంది. సాయి రాజేశ్ దర్శకత్వంలో ఇటీవలే ఒక మూవీ మొదలైంది.

Advertisement
 

More

Related Stories