నవల వేరు, సినిమా వేరు: క్రిష్


దర్శకుడు క్రిష్ తీసిన ‘కొండపొలం’ ఈ శుక్రవారం విడుదల కానుంది. ఇందులో ‘ఉప్పెన’ ఫేమ్ వైష్ణవ్ తేజ్ హీరో. హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ నటించింది.

‘కొండపొలం’ అనేది అదే పేరుతో సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన నవల ఆధారంగా తెరకెక్కింది. ఈ నవలని దర్శకుడు సుకుమార్ చదవమని క్రిష్ కి చెప్పారట. కరోనా టైంలో డైరెక్టర్స్ మీట్ జరిగింది. ఆ మీటింగ్ లో ఇంద్రగంటి మోహనకృష్ణ, సుకుమార్‌ ‘కొండపొలం’, ‘శప్తభూమి’ నవలల గురించి ప్రస్తావన తీసుకొచ్చారట. వారు అంత గొప్పగా చెప్పడంతో వెంటనే కొని నవలలు చదివానని చెప్తున్నారు క్రిష్.

‘కొండపొలం’ చదివిన వెంటనే సినిమా తీయాలని హక్కులు కొన్నాను అని తెలిపారు క్రిష్. ఐతే, క్రిష్ కన్నా ముందే సుకుమార్ కూడా తన అసిస్టెంట్ తో తెరకెక్కిద్దామని అనుకున్నారట. కానీ క్రిష్ తీస్తున్నాడని తెలియడంతో ఆ ఆలోచనని విరమించుకున్నారట.

ఇక ఈ సినిమా కథ నవలకి కొంత భిన్నంగా సాగుతుందని చెప్తున్నారు. సినిమా మాధ్యమంలో కథ ఎలా చెప్పాలో అలా కొన్ని మార్పులు చేశారు. నవలలో హీరోయిన్ పాత్ర లేదు. సినిమా కోసం ఓబులమ్మ అనే పాత్రని సృష్టించారు క్రిష్. ఆ రోల్ ని రకుల్ చేసింది.

ఈ సినిమా కూడా అనుకోకుండా మొదలుపెట్టారు క్రిష్. పవన్ కళ్యాణ్ తో ఆయన “హరి హర వీరమల్లు” సినిమా కొంత భాగం తీసిన తర్వాత హడావిడిగా దీన్ని షురూ చేశారు. అలా ఎందుకు జరిగింది అంటే..

“హరిహర వీరమల్లు మార్చి 12 వరకు షూటింగ్ చేశాం. దాదాపు 25 శాతం పూర్తయింది. ఆ తరువాత లాక్డౌన్ వచ్చింది. సినిమా పరిశ్రమ మొత్తం స్థంభించిపోయింది. పనులు లేక అందరూ ఖాళీగా ఉన్నారు. అందుకే గ్యాప్‌లో ఓ సినిమా చేద్దాం, అందరికీ పని కల్పించినట్టు ఉంటుందని అనుకున్నాను. సెప్టెంబర్, అక్టోబర్‌లో షూటింగ్ చేసేస్తాను అని చెప్పాను. మిగతాది అంతా కూడా గ్రాఫిక్స్ పని అని చెప్పాను. ఆ తరువాత రత్నం గారికి చెబితే ఓకే అన్నారు. ఈ నవంబర్ రెండో వారం నుంచి మళ్లీ హరి హర వీరమల్లు షూటింగ్ ప్రారంభిస్తాం,” అని క్రిష్ వివరించారు.

అలాగే, ఇలాంటి కథ ఒకటి ఇంతకుముందు వెంకటేష్ తో ప్లాన్ చేశారు క్రిష్. “జంగిల్ బుక్‌లాంటి సినిమాను వెంకటేష్ గారితో చేయాల్సింది. గౌతమిపుత్ర శాతకర్ణి తరువాత ఆ సినిమా చేయాలి అనుకున్నాను. “అతడు అడవిని జయించాడు” అనే పుస్తకం హక్కులు కొని తీయాలనుకున్నాను. కానీ ఆ హక్కులు దొరకలేదు. అందుకే ఆ ఆలోచనని పక్కన పెట్టాను,” అని చెప్పారు క్రిష్.

Advertisement
 

More

Related Stories