ఒక్క స్పీచ్ తో అల్లకల్లోలం

Pawan Kalyan


ఊహించినట్లుగానే జరిగింది. పవన్ కళ్యాణ్ నిన్న చేసిన ప్రసంగం రాజకీయంగా పెద్ద దుమారం రేపింది. వైఎస్సార్సీ పార్టీ నాయకులు, మంత్రులు, ఎమ్మేల్యేలు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలని తిప్పికొడుతూ ఘాటుగా స్పందించారు.

ఇక సినిమా ఇండస్ట్రీ కూడా చీలింది. పవన్ కళ్యాణ్ స్పీచ్ కి మద్దతుగా నాని, కార్తికేయ, సంపూర్ణేష్ బాబు వంటి యువ హీరోలు మద్దతు పలుకుతూ ట్వీట్లు వేశారు. మిగతా హీరోలు మాత్రం మౌనాన్ని ఆశ్రయించారు. ఐతే, పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగానికి ప్రతిచర్యగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరింత ఆంక్షలు విధిస్తుందనే భయం సినిమా ఇండస్ట్రీ నిర్మాతల్లో, హీరోల్లో ఉంది. అందుకే, టాలీవుడ్ ఇండస్ట్రీ అంతా ప్రస్తుతం గంభీరమైన వాతావరణం నెలకొని ఉంది.

అంతేకాదు, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున నారాయణ దాస్ నారంగ్ ఒక ప్రకటన విడుదల చేశారు. “తెలుగు సినిమా పరిశ్రమ ప్రస్తుతం అనేక సంక్షోభాలను తట్టుకొని నిలబడే ప్రయత్నం చేస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి రెండు కళ్ళు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు సినిమా ఇండస్ట్రీకి సంపూర్ణ మద్దతు ఇస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారు కూడా పరిశ్రమ చేసిన వినతులకి సానుకూలంగా ఉన్నారు. ప్రస్తుతం వివిధ వేదికలపై వ్యక్తిగత హోదాలో వినిపిస్తున్న అభిప్రాయాలు తెలుగు సినిమా పరిశ్రమ అభిప్రాయం కాదు. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాత్రమే తెలుగు సినిమాకి సంబంధించిన అధికారిక సంస్థ. రెండు రాష్ట్రాల్లో ఈ సంస్థకి మాత్రమే అన్ని హక్కులు ఉన్నాయి,” అని వివరణ ఇచ్చారు.

సడెన్ గా ఈ వివరణ ఇవ్వడం వెనుక కారణం… ప్రభుత్వంతో ఘర్షణ వైఖరి వద్దనే. పవన్ కళ్యాణ్ ప్రసంగాన్ని తెలుగు చిత్రసీమ అభిప్రాయంగా తీసుకొని… టికెట్ రేట్ల విషయంలో మరింత మొండి వైఖరి అవలంబిస్తారేమో అని భయపడుతున్నారు.

Advertisement
 

More

Related Stories