తమన్: థియేటర్లు ఊగిపోతాయి!

మహేష్ బాబు నటిస్తున్న ‘సర్కారు వారి పాట’లో ‘కళావతి’ వంటి పాటలు ఇప్పటికేమిలియన్ల కొద్దీ వ్యూస్ పొందాయి. తమన్ సంగీతం అందించిన ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇటీవల తమన్ స్వరపరిచిన పెద్ద సినిమాలన్నీ విజయం సాధించి.

“కళావతి పాట 150 మిలియన్ వ్యూస్ పొందింది. అది అంత తేలిక విషయం కాదు. సినిమాలే కాదు పాటలు కూడా పాన్ ఇండియా అయిపోయాయి. ఒక పాట రీచ్ కావాలంటే చాలా కష్టపడాలి. హంగామా చెయ్యాలి,” అని అంటున్నారు తమన్.

“చాలా రోజుల తర్వాత ఒక మెలోడి పాటకు బాగా పేరు వచ్చింది. మెలోడీ సాంగ్ కి థియేటర్ స్టేజ్ ఎక్కి అభిమానులు డ్యాన్స్ చేస్తారు. నిజానికి ఈ సినిమా బాగా ఆలస్యం అయింది. పాటలు ఎప్పుడో కంపోజ్ చేశాం. లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా ఆలస్యం అవుతుందని ముందే తెలుసు. అందుకే, ఎప్పుడు వచ్చినా ఫ్రెష్ గా వుండే సౌండ్స్ వుండాలని ముందే ఫిక్స్ అయ్యా,” అని అంటున్నారు తమన్.

ఇప్పుడు తమన్ హవా నడుస్తోంది. మరి ఇది అతనికి బెస్ట్ పీరియడ్ అనుకోవచ్చా? “గోల్డెన్ పిరియడ్ అని చెప్పను కానీ నా మీద పెట్టుకున్న నమ్మకాలని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నా. అలాగే, ఇప్పుడు తెలుగు సినిమా పాన్ ఇండియాగా మారింది. ఇది కొత్త సవాల్. దానికి తగ్గట్లు మార్పు చెందాలి.” ఇది తమన్ మాట.

రాబోయే ఆల్బమ్స్ ఏంటి? “రామ్ చరణ్ – శంకర్ సినిమా చేస్తున్నా. ఒక పాట బ్యాలెన్స్ వుంది. చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ త్వరలోనే విడుదల కానుంది. తమిళ సూపర్ స్టార్ విజయ్ తో చేస్తున్న సినిమాకి మూడు పాటలు, బాలకృష్ణ గారి సినిమా ఒక పాట రికార్డ్ చేశాం,” అని తెలిపారు.

తమన్ బాలీవుడ్ సినిమాలు కూడా చేసే ప్రయత్నాలు మొదలు పెట్టారు.

Advertisement
 

More

Related Stories