ఆది: రామ్ తగ్గడం వల్లే పేరొచ్చింది

ఆది పినిశెట్టికి విలన్ పాత్రలు కొత్త కాదు. ‘సరైనోడు’ చిత్రంలో ఆది విలన్ గా ఇరగదీశాడు. మళ్ళీ ఇప్పుడు అలాంటి పేరు తెచ్చుకున్నాడు ‘ది వారియర్’ చిత్రంలో. హీరో రామ్ పోతినేనికి గట్టి సవాల్ విసిరిన నటుడిగా ప్రశంసలు లభిస్తున్నాయి. ఆది పినిశెట్టితో ఇంట‌ర్వ్యూ…

చాలా గ్యాప్ తర్వాత విల‌న్ గా నటించారు…

‘స‌రైనోడు’, ‘అజ్ఞాత‌వాసి’ చిత్రాలు చేశాక వాటి కన్నా బెట‌ర్‌గా ఉండే పాత్రలు వస్తేనే చేద్దామని ఆగాను. ‘ది వారియ‌ర్’లో రోల్ విన్న‌ప్పుడు ఎక్జయిట్ అయ్యాను. విలన్ పాత్ర గురుకు ఒక క్యారెక్ట‌రైజేష‌న్ ఉంది. అది నాకు న‌చ్చింది.

వెంటనే ఒప్పుకున్నారా?

గురు పాత్ర గురించి చెప్పగానే చెయ్యాలనుకున్నా. కానీ కొన్ని డౌట్స్ వచ్చాయి. వాటి గురించి అడిగినప్పుడు లింగుస్వామి గారి మరింతగా నేరేట్ చేశారు. రెండు రోజుల తర్వాత ఒప్పుకున్నాను. ఇప్పుడు ఈ పాత్ర హైలెట్ అయిందని అంటే ఆనందంగా ఉంది. నేను షూటింగ్ సమయంలో లింగుస్వామి గారు చెప్పింది ఫాలో అయిపోయా. గురు పాత్రకి నేను కొంత వర్క్ చేశాను కానీ క్యారెక్టరైజేషన్ క్రెడిట్ మొత్తం లింగుస్వామి గారిదే.

రామ్ తో నటించడం…

రామ్ ఎనర్జీ, అతని నటన ఇష్టం. ఈ సినిమా క్లైమాక్స్ ఫైట్ షూటింగ్ ఒక పాట షూటింగ్ లా జ‌రిగింది. మేమిద్దరం ఫైట్ చేస్తుంటే సాంగ్ లో డ్యాన్స్ చేస్తున్నట్టు ఉందని డైరెక్టర్ అన్నారు. అంతలా నేను, రామ్ సింక్ అయ్యాం. మేం కష్టపడి ఏమీ చేయలేదు. ఫైట్ మాస్టర్ అన్బు అరివు మాస్టర్ల చెప్పింది చేసి చూపించాం.

మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంది?

పెద్దగా ఏమి మారలేదు. ప్రేమించుకున్న కాలంలో ఎలా ఉన్నామో, ఇప్పుడూ అలాగే ఉన్నాం. మమ్మల్ని అర్థం చేసుకునే తల్లిదండ్రులు ఉన్నారు. అంతా హ్యాపీగా ఉంది.

మీ నాన్న రవితేజ పినిశెట్టి అభిప్రాయం ఏంటి?

నాన్నగారు (రవిరాజా పినిశెట్టి) నా యాస ఇంకొంచెం బాగుండాల్సింది అన్నారు. కొన్ని సన్నివేశాల్లో నా పెర్ఫార్మన్స్ బాగుంది, రామ్ వల్ల నేను హైలెట్ అయ్యాను అని అన్నారు. రామ్ తన హీరో ఇమేజ్ విషయంలో కొంత తగ్గారు. అలా నాకు పేరు ఎక్కువ వచ్చింది అనేది మా నాన్న అభిప్రాయం.

Advertisement
 

More

Related Stories