మూడు, నాలుగు నెలలు ఇంతే!

Telugu releases

“18-45 ఏళ్ల వారికి వ్యాక్సినేషన్ సెప్టెంబర్ కి గాని ఊపందుకోదు. ఈ కరోనా ప్రభావం వచ్చే ఏడాది (2022) ఫిబ్రవరి వరకు ఇలాగే ఉంటుంది.”

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్న మాటలివి. ఇందులో చాలా వరకు వాస్తవం ఉంది. ప్రస్తుతం దేశంలో వ్యాక్సినులు అందుబాటులో లేవు. సరైన సన్నద్ధత లేకుండానే ప్రధాని మోదీ హడావిడిగా వ్యాక్సినేషన్ ప్రారంభించారు. కరోనాని ఇండియా జయించేసింది అని ఆర్భాటంగా ప్రకటించారు. ఇప్పుడు సెకండ్ విలయ తాండవం చేస్తోంది. మొదటి వేవ్ కేవలం టీజర్ మాత్రమే… ఇప్పుడు చూస్తున్నది సినిమా అన్న రేంజులో కరోనా జనాలని వెంటాడుతోంది. చావులు, ఆక్సిజన్ కొరత, ఆసుపత్రిల్లో బెడ్ లు లేకపోవడం వంటి వార్తలు వింటున్నాం, చూస్తున్నాం.

వ్యాక్సిన్లు లేక నిన్నా, ఈ రోజు తెలంగాణాలో వ్యాక్సినేషన్ బంద్ చేశారు. దాదాపుగా చాలా రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి. ఇది నేటి భారతం!

దేశంలో ఉన్న జనాభాకి కనీసం 70 శాతం జనాలకు వ్యాక్సిన్లు ఇస్తే… అప్పుడు అందరిలో ఇమ్మ్యూనిటి పెరిగి కరోనా ప్రభావం తగ్గుతుందని శాస్త్రవేత్తలు, డాక్టర్లు చెప్తున్నారు. అది జరగాలంటే మరో నాలుగు, ఐదు నెలల కాలం పట్టేలా ఉంది. అంటే, తెలుగు సినిమా మళ్ళీ పూర్తి స్థాయిలో కలెక్షన్లను చూడాలంటే చాలా కాలం పడుతుంది. ఇప్పట్లో పెద్ద సినిమాల విడుదలలుండవు.

గతేడాది లాక్డౌన్ ప్రకటించినప్పుడు…రెండు, మూడు నెలల్లో సినిమాల విడుదలకు మార్గం సుగమం అవుతుంది, కరోనా తగ్గిపోతుందనుకున్నారు. కానీ సినిమా ఇండస్ట్రీ మళ్ళీ పుంజుకోవడానికి 9 నెలల టైం పట్టింది. 2020 మార్చిలో ఆగిన కలెక్షన్ల సౌండ్ 2021 జనవరిలో వినిపించడం మొదలైంది.

ఇప్పుడు కూడా రెండు నెలల్లో అంతా సర్దుకుంటుంది అనుకోవడం భ్రమే అని అర్థం అవుతుంది. వ్యాక్సినేషన్ ఎంత త్వరగా స్పీడ్ అందుకుంటుందనే దాన్ని బట్టి తెలుగు సినిమా ‘బ్యాక్ టు పెవిలియను’కు రాగలదనేది చెప్పొచ్చు.

విడుదల టైంలో ఆగిన సినిమాలివే…!

సరిగ్గా వారంలో, నెల రోజుల్లో విడుదల కావాల్సిన పరిస్థితుల్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్ పెద్దదే. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల తీసిన ‘లవ్ స్టోరీ’ని ఏప్రిల్ 16న విడుదల చెయ్యాలనుకున్నారు. వారం రోజుల ముందు వాయిదా వేశారు. ఆ తర్వాత లైన్లో ఉన్న నాని, శివ నిర్వాణ కాంబినేషన్లో రూపొందిన ‘టక్ జగదీష్’, రానా, సాయి పల్లవిగా తెరకెక్కిన ‘విరాట పర్వం’ కూడా నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈ మూడు సినిమాలకు మంచి హైప్ వచ్చింది. అన్నీ అంచనాలున్నవే. ప్రమోషన్స్ కూడా జరిగాయి. కానీ విడుదల వాయిదా వేయక తప్పలేదు.

మళ్ళీ రిలీజ్ ల ప్రవాహం ఎప్పుడు మొదలైనా… ముందుగా వీటికే ప్రియారిటీ ఇవ్వాలి.

మే నెలలో రావాల్సిన వాటిలో ప్రముఖమైనవి… మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ నటించిన కొరటాల శివ మూవీ…’ఆచార్య’. మే 13న విడుదల కావాల్సిన ఈ మూవీ వాయిదా పడింది. ఈ సినిమా షూటింగ్ ఇంకా మిగిలే ఉంది. అలాగే, మే 14న రావాల్సిన వెంకటేష్ రీమేక్ మూవీ ‘నారప్ప’ కూడా అదే బాట పట్టింది. అయితే, షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసుకొని రెడీగా ఉంది.

నందమూరి బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘అఖండ’, రవితేజ హీరోగా రమేష్ వర్మ తీస్తున్న ‘ఖిలాడీ’ మే 28న విడుదల అన్నట్లుగా ప్లాన్ చేశారు. కానీ అది సాధ్యం కాదు. ఈ రెండు సినిమాల షూటింగ్స్ నిలిచిపోయాయి. ఇంకా చాలా పోర్షన్ పూర్తి చెయ్యాలి.

Advertisement
 

More

Related Stories