హ్యాట్రిక్ కొట్టిన మెహర్!

Meher Ramesh

దర్శకుడు మెహర్ రమేష్ “కంత్రి”, “బిల్లా” వంటి సినిమాలు తీశారు. కానీ, ఆయన ఎక్కువగా ట్రోల్ అయింది మాత్రం ఎన్టీఆర్ హీరోగా “శక్తి” చిత్రంతో. “మగధీర”ని మించి భారీ హిట్ కొట్టాలనే ప్రయత్నంతో చేసిన “శక్తి” బెడిసి కొట్టింది. అంతే కాదు, అప్పటి నుంచి మెహర్ రమేష్ ట్రోలింగ్ సరుకు అయ్యారు.

“శక్తి”ని మించిన ఫ్లాప్ తీసిన ఘనత కూడా మెహర్ కి దక్కుతుంది. “షాడో” చిత్రంతో ఆ అపప్రధ మూటగట్టుకున్నారు. “శక్తి”, “షాడో”ల దెబ్బకు నిర్మాతలు కోలుకునేందుకు చాలా కాలం పట్టింది. ఇక ఈ దర్శకుడికి దాదాపు 9 ఏళ్ళు సినిమాలు తీసే అవకాశం రాకుండా పోయింది.

ఆ రెండు సినిమాలు తెచ్చిన బ్యాడ్ నేమ్ ని పోగుట్టుకునే మంచి అవకాశం చిరంజీవి రూపంలో దక్కింది మెహర్ కి. “భోళా శంకర్”కి మెహర్ దర్శకుడు. నిజానికి ఈ సినిమా హిట్ అవుతుందని ఎవరూ ఆశించలేదు. ఎదో విధంగా పాస్ మార్కులు తెచ్చుకున్నా మెహర్ గట్టెక్కేవారు. పాత ఫ్లాపులను జనం మరిచిపోయేవాళ్లు.

కానీ, “భోళా శంకర్” దారుణంగా పరాజయం పాలు కావడమే కాదు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువ ట్రోలింగ్ జరుగుతోంది. “మెహర్ రమేష్ ఈజ్ బ్యాక్” అని, “మెహర్ రమేష్ మళ్ళీ తన “శక్తి”ని చూపించాడు” అంటూ మీమ్స్ తో వాయిస్తున్నారు.

ALSO READ: భోళా శంకర్ – తెలుగు రివ్యూ

మొత్తంగా పదేళ్ల టైంలో వరుసగా మూడు దారుణాతి దారుణమైన ఫ్లాప్స్ అందించారు. అలా ఫ్లాపుల పరంగా హ్యాట్రిక్ దక్కింది ఆయనకి.

Advertisement
 

More

Related Stories