RRR రిలీజ్ డేట్ ఇప్పట్లో తేలదు

RRR

రాజమౌళి తీస్తున్న “ఆర్ ఆర్ ఆర్” షూటింగ్ చివరి దశకు చేరుకొంది. రెండు పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది. ఆ రెండు పాటలు ఈ నెలలో తీస్తారు. దాంతో, “ఆర్ ఆర్ ఆర్” ఈ ఏడాది అక్టోబర్ 31న విడుదల అవ్వడం ఖాయమని మీడియాలో వార్తలు వస్తున్నాయి. కానీ అది సాధ్యం కాదు.

“ఆర్ ఆర్ ఆర్” సినిమాని దాదాపు 12 భాషల్లో విడుదల చేస్తున్నారు. అందులో తెలుగు, హిందీ, తమిళ్ మార్కెట్లు కీలకం. హిందీ సినిమాలు ఈ నెలాఖరు నుంచి విడుదల కానున్నాయి. అక్షయ్ కుమార్ హీరోగా రూపొందిన “బెల్ బాటమ్” జులై 27న విడుదల కానుంది. ఆ సినిమాకి జనం వస్తే… మిగతా బాలీవుడ్ పెద్ద సినిమాలు థియేటర్లకు క్యూ కడుతాయి. లేదంటే… ఇంకా ఆలస్యం అవుతుంది.

“ఆర్ ఆర్ ఆర్” సినిమాని భారీ మొత్తాలకు పెన్ ఇండియా (హిందీ), లైకా (తమిళ్), ఫార్స్ (ఓవర్సీస్) వంటి సంస్థలకు అమ్మారు. ఈ మూడు సంస్థలే దాదాపు 500 కోట్ల రూపాయలు చెల్లించాయి. థియేటర్ల నుంచి దాదాపు 600 కోట్ల రూపాయలు వస్తేనే కొన్నవాళ్లకు గిట్టుబాటు అవుతుంది. అంటే, ఇండియా మొత్తం మార్కెట్ ఓపెన్ అవ్వాలి. కాబట్టి ఈ సినిమా రిలీజ్ విషయంలో ఎన్నో ఆలోచించాలి. షూటింగ్ అయిపోయిందనో, తెలంగాణాలో లాక్డౌన్ ఎత్తేశారనో రిలీజ్ చెయ్యరు.

“ఆర్ ఆర్ ఆర్” విడుదల కావాలంటే ఇవన్నీ చూసుకోవాలి. ఇన్ని పితలాటకాలు ఉన్నాయి కాబట్టే “ఆర్ ఆర్ ఆర్” విడుదల ఎప్పుడు అనే విషయంలో కచ్చితంగా చెప్పలేరు. ఈ ఏడాది అక్టోబర్ 31న విడుదల కాకపోవడానికి 99 పర్సెంట్ అవకాశాలు ఉన్నాయి.

Advertisement
 

More

Related Stories