విశ్వనాథ్ ఆణిముత్యానికి పాతికేళ్లు

25 years of Subha Sankalpam
Tuesday, April 28, 2020 - 16:45

ఈ రోజంతా పోకిరి మేనియా నడుస్తోంది. మహేష్ బాబు హీరోగా నటించిన ఈ సినిమా ఇవాళ్టితో 14 ఏళ్లు పూర్తిచేసుకోవడంతో అంతా సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తున్నారు. అయితే సరిగ్గా పాతికేళ్ల కిందట ఇదే రోజు కళాఖండం విడుదలైంది. దాని పేరు శుభసంకల్పం. అవును.. కె.విశ్వనాథ్, కమల్ హాసన్ కాంబినేషన్ లో తెరకెక్కిన శుభసంకల్పం సినిమా విడుదలై నేటికి సరిగ్గా 25 సంవత్సరాలు.

అంతకుముందు కళాతపస్వి కె.విశ్వనాథ్, లోకనాయకుడు కమల్ హాసన్ కాంబినేషన్ లో సాగరసంగమం, స్వాతిముత్యం లాంటి క్లాసిక్స్ వచ్చాయి. వాటికి ఏమాత్రం తీసిపోని విధంగా వచ్చిన శుభసంకల్పం సినిమా కూడా క్లాసిక్ స్టేటస్ సంపాదించుకుంది.

కోదండపాడి ఫిలిమ్స్ సర్క్యూట్ బ్యానర్ పై ఎస్పీ బాలసుబ్రమణ్యం ఈ సినిమాను నిర్మించడం విశేషం. కమల్ హాసన్ సహనిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాలో కె.విశ్వనాథ్ కీలక పాత్ర పోషించడానికి కారణం కమల్ హాసన్. ఆయన అడగడం వల్లనే విశ్వనాథ్ కెమెరా ముందుకొచ్చారు.

కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమాలోని పాటలన్నీ వేటికవే సూపర్ హిట్స్ గా నిలిచాయి. అయితే "సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు" అనే పాట మాత్రం అన్నింటికంటే పెద్ద హిట్టు. పాతికేళ్లయినా ఇప్పటికీ ఈ పాట ఏదో ఒక చోట వినిపిస్తూనే ఉంటుంది. సినిమాలో పాటలన్నీ ఎస్పీ బాలు, శైలజ, చిత్ర ఆలపించారు.

తెలుగుదనం ఉట్టిపడేలా తెరకెక్కిన ఈ సినిమా అవార్డుల పంట పండించింది. ఏకంగా 5 నంది అవార్డులు, 3 ఫిలింఫేర్ అవార్డులు అందుకుంది. ఈ సినిమాతోనే ఉత్తమ నటిగా ఆమని నంది అవార్డు అందుకుంది. అంతేకాదు, దర్శకుడిగా ఎన్నో పురస్కారాలు అందుకున్న కె.విశ్వనాథ్.. ఈ సినిమాతో బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నంది అవార్డు అందుకున్నారు. యూట్యూబ్ లో అందుబాటులో ఉన్న ఈ ఆణిముత్యాన్ని, ఈ లాక్ డౌన్ టైమ్ లో మరోసారి చూడొచ్చు.