96కి క‌న్నా ముందే మ‌రిన్ని 96 క‌థ‌లు!

90's themed movies in Telugu
Sunday, March 10, 2019 - 12:15

"96" అని ఒక త‌మిళ చిత్రం గ‌తేడాది విడుద‌లై ఎన్నో ప్ర‌శంస‌లు అందుకొంది. విజ‌య్ సేతుప‌తి, త్రిష న‌టించిన 96 ఒక అంద‌మైన, అద్భుత‌మైన ప్రేమ‌క‌థ అని క్రిటిక్స్‌, జ‌నం..అంద‌రూ తీర్మానించారు. 1996లో త‌న స్కూల్‌మేట్‌ని ప్రేమిస్తాడు హీరో. కానీ ప్రేమ‌ని ఎక్స్‌ప్రెస్ చేయ‌లేడు. కొన్నేళ్ల త‌ర్వాత వారు రీయూనియ‌న్‌కి మీట్ అవుతారు. ఆ త‌ర్వాత జ‌రిగిందేంటనేది 96 చిత్రం క‌థాంశం. 96లో జ‌రిగిన స‌న్నివేశాలు, నేటి కాలం క‌థ‌..రెండూ ఈ సినిమాలో ఉంటాయి. 

ఇదే సినిమా ఇపుడు తెలుగులో అదే ద‌ర్శ‌కుడు దిల్‌రాజ్ బ్యాన‌ర్‌కోసం రీమేక్ చేస్తున్నాడు. స‌మంత‌, శ‌ర్వానంద్ జంట‌గా న‌టించ‌నున్నారు. 

ఐతే.. 90 థీమ్ క‌థ‌లు ఇపుడు తెలుగులో ట్రెండ్ అయిన‌ట్లు క‌నిపిస్తోంది. నాగ చైత‌న్య‌, స‌మంత జంట‌గా న‌టించిన "మ‌జిలీ" సినిమాలో కూడా 90ల బ్యాక్‌డ్రాప్‌లోనే సాగుతుంది. నాగ చైత‌న్య ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు, ఆ ప్రేమ విఫ‌లం అవుతుంది. త‌ర్వాత ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. గ‌తంలో ప్రేమించిన అమ్మాయికి సంబంధించిన అంశం అత‌ని జీవితంలోకి మ‌ళ్లీ వ‌స్తుంది. 90ల బ్యాక్‌డ్రాప్‌, క్రికెట్ థీమ్‌తో సాగే మెచ్యుర్డ్ ల‌వ్‌స్టోరీ ఇది. 

ఇక ఏప్రిల్ 19న రానున్న నాని న‌టించిన "జెర్సీ" సినిమా క‌థ కూడా 1990లోనే జ‌రుగుతుంది. ఇటీవ‌ల విడుద‌లైన పోస్ట‌ర్ చూస్తేనే అర్థ‌మ‌వుతుంది. ఈ సినిమా మెయిన్ స్టోరీ 1996 రంజీ మ్యాచ్‌ల (క్రికెట్‌) చుట్టూ తిరుగుతుంది. ఇందులోనూ క్రికెట్‌, 1990 కామ‌న్ ఎలిమెంట్స్‌. 

అంటే "96" సినిమా రీమేక్ రాక‌ముందే 96 థీమ్ క‌థ‌లు ఈ వేస‌విలో వెండితెర‌పై ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నాయి.