ఆవిరి వచ్చింది కానీ అన్నం ఉడకలేదు

Aaviri disappoints
Saturday, November 2, 2019 - 09:30

నిన్న రిలీజైన ఆవిరి సినిమాపై నెటిజన్ల కామెంట్ ఇది. ఆవిరి అంటూ రవిబాబు తీసిన హారర్ థ్రిల్లర్ సినిమా సగమే ఉడికిందని, కుక్కర్ నుంచి ఆవిరైతే వచ్చింది కానీ అన్నం పూర్తిగా ఉడకలేదంటూ సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు. నిజమే.. అన్నీ తానై రవిబాబు తీసిన ఆవిరి సినిమా థియేటర్లలో ప్రేక్షకుల సహనాన్ని ఆవిరి చేస్తోంది.

ఒకప్పుడు రవిబాబు సినిమాలకు ఓ బ్రాండ్ ఉండేది. ఆ బ్రాండ్ వాల్యూకు తగ్గట్టే తన సినిమాల ప్రమోషన్లలో వెనక నుంచి ముందుకు తిరుగుతూ ట్రయిలర్, టీజర్ల చివర్లో తన బొమ్మ వేసుకునేవాడు రవిబాబు. అప్పట్లో అదొక ట్రెండ్. ఇప్పటికీ రవిబాబు ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాడు కానీ సినిమాలు మాత్రం అప్పట్లా లేవు. ఆ బ్రాండ్ లేదు. దీనికి మరో ఉదాహరణ ఆవిరి.

అవును 2, అదిగో లాంటి డిజాస్టర్ల తర్వాత ఆవిరితో మరోసారి తనకు ఎంతో ఇష్టమైన హారర్ సబ్జెక్ట్ తీసుకున్నాడు రవిబాబు. కాకపోతే ఆ హారర్ లో కొత్తదనం చూపించలేకపోయాడు. తనకు ఎంతో అలవాటైన సన్నివేశాల్ని అలా అలా తీసుకుంటూ వెళ్లిపోయాడు. దెయ్యం ఆవిరి రూపంలో కనిపించడం మినహా ఇందులో కొత్తదనం లేదు. అలాగని ఆ ఆవిరిని కూడా పూర్తిస్థాయిలో వాడుకోలేదు. ఇంకా చెప్పాలంటే కాస్త మెరవాల్సిన ఆవిరిని నీరుగార్చేశాడు రవిబాబు. మిగిలిన ఆవిరి కాస్తా గాల్లో కలిసిపోయింది.