ఆహా ..ఏమి రికార్డుల పిచ్చి!

Aha and comedy records
Thursday, March 12, 2020 - 12:45

రికార్డుల గురించి గొప్పగా చెప్పుకోవడం అల్లు అరవింద్ కు అలవాటు. దశాబ్దాలుగా సినిమా ఫీల్డ్ లో ఉండి ఆయనకు అది ఓ అలవాటుగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే అదే అలవాటును ఆహా స్ట్రీమింగ్ యాప్ కు కూడా వర్తింపజేస్తే ఎలా? సరిగ్గా ఇక్కడే ఈ యాప్ విమర్శలు ఎదుర్కొంటోంది.

ఏ యాప్ కైనా ప్రమోషన్ తప్పనిసరి. తమ దగ్గర ఫలానా కంటెంట్ ఉందని ప్రమోట్ చేసుకుంటాయి ఏవైనా. రకరకాల సినిమాలు, వెబ్ సిరీస్, ఒరిజినల్ కంటెంట్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తాయి. నెట్ ఫ్లిక్స్ అయినా, అమెజాన్ ప్రైమ్ అయినా, జీ5 అయినా ఇన్నాళ్లూ అవే చేశాయి. కానీ ఆహా మాత్రం అలా చేయడం లేదు.

తమ దగ్గరున్న కంటెంట్ ను పక్కనపెట్టి, మరో యాంగిల్ లో ప్రమోషన్ స్టార్ట్ చేసింది ఆహా. ఈ యాప్ కు ఇప్పటివరకు 20 లక్షల మంది యూనిక్ విజిటర్స్ వచ్చారట. 6లక్షల 70వేల మంది డౌన్ లోడ్ చేసుకున్నారట. అంతేకాదు.. సగటున ప్రతి ఒక్కరు 36 నిమిషాలు తమ యాప్ లో కాలం గడుపుతున్నట్టు ప్రకటించుకుంది. నిజానికి ఇవ జనాలకు అక్కర్లేని సంఖ్యలు. అలవాటు కొద్దీ అల్లు అరవింద్ వీటిని ప్రచారానికి వాడుకోవడం కాస్త నవ్వు తెప్పిస్తోంది.

నిజానికి ఆహా వద్ద ప్రస్తుతానికి పెద్దగా కంటెంట్ లేదు. ఖైదీ, ప్రెషర్ కుక్కర్ లాంటి సినిమాలు మినహా పెద్ద సినిమాల్లేవు. ఒరిజినల్ కంటెంట్ లో కూడా హిట్టయిన దాఖలాల్లేవు. అలాంటప్పుడు సైలెంట్ గా ఉంటే బెటర్. లేదంటే ప్రచారాన్ని ఇంకో రూపంలో చేసుకుంటే మంచిది. ఇలా ఈ నంబర్లను బయటపెట్టడం మాత్రం అసమంజసం. ఎందుకంటే పోటీగా ఉన్న జీ5, అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ లు కూడా ఆహా చెబుతున్న సెగ్మెంట్ లో నంబర్లను రిలీజ్ చేస్తే, అది ఆహాకే పరువు తక్కువ.