ఆకుల మాట‌ల్లో చిన్నికృష్ణ బాగోతం!

Akula Siva threatens to expose Chinni Krishna
Wednesday, March 27, 2019 - 14:15

ఇద్ద‌రు ర‌చ‌యితలు తిట్టుకుంటున్నారు. ఎన్నిక‌ల వేళ గ‌త చ‌రిత్ర‌ల‌ను తవ్వుకొంటున్నారు సినిమా సెల‌బ్రిటీలు. మొన్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై స్ట్రాంగ్‌గా రియాక్ట‌య్యారు ర‌చ‌యిత చిన్నికృష్ణ‌. ఇంద్ర‌, బ‌న్ని గంగోత్రి వంటి మెగా హీరోల సినిమాల‌కి క‌థ‌లు అందించిన చిన్నికృష్ణ ఇపుడు మెగా హీరోల‌పై మండిప‌డుతున్నారు. వైఎస్సార్సీ పార్టీ సానుభూతిప‌రుడు అయిన చిన్నికృష్ణ ఇటీవ‌ల ప‌వ‌న్ క‌ల్యాణ్ చేసిన వ్యాఖ్య‌ల‌కి కౌంట‌ర్ ఇచ్చారు.

దాంతో చిన్నికృష్ణ బండారం బ‌య‌ట‌పెడుతానంటూ మ‌రో ర‌చ‌యిత ఆకుల శివ వీడియోని విడుద‌ల చేశాడు. చిన్నికృష్ణ ఇంటి పేరు, సామాజిక వ‌ర్గం కూడా ఆకుల శివ‌ది ఒక‌టేన‌ట‌. "ఇంద్ర‌లాంటి హిట్ సినిమాకి క‌థ ఇచ్చినా...మెగాస్టార్ చిరంజీవి త‌న‌ని ఇంటికి పిలిచి భోజ‌నం పెట్ట‌లేదు. బాల్ పెన్ ఇవ్వ‌లేదు అంటూ కూతలు కూస్తున్నావ్‌. నీ చ‌రిత్రి బ‌య‌ట‌పెట్ట‌నా? నీ గురించి తెలిసిన‌వాడు ఎవ‌డైనా ఇంటికి భోజ‌నానికి పిలుస్తాడా? న‌న్ను సురేష్‌బాబు అనేక సార్లు ఇంటికి పిలిచి భోజనం పెట్టాడు (సురేష్‌బాబుది, ఆకుల శివ‌ది వేర్వేరు సామాజిక వ‌ర్గాలు అయినా అనే అర్థంలో చ‌దువుకొండు). నిన్ను మాత్రం ఎవ‌రూ పిల‌వ‌రు. నీ చ‌రిత్ర అలాంటిది," ఇలా దుమ్మెత్తిపోశారు ఆకుల శివ‌.

అంతేకాదు, ఇంద్ర సినిమాలో అనేక సీన్లు త‌నే రాశాన‌ని ఆకుల చెప్పుకొచ్చారు. అలాగే చిన్నికృష్ణ వ్య‌క్తిగ‌త జీవితంలోని అంశాల‌పై కూడా ఆకుల శివ ఏక‌రవుపెట్టారు.

మొత్త‌మ్మీద రాజ‌కీయాల కార‌ణంగా సినిమా తార‌ల గ‌త చ‌రిత్ర‌లు బ‌య‌టికి వ‌స్తున్నాయి. ఇందులో నిజానిజాలెంతో వారికే తెలియాలి.