నాపై కామెంట్స్ స‌హ‌జ‌మే: ఆనంద్‌

Anand Deverakonda speaks about Dorasani, his debut
Tuesday, July 9, 2019 - 15:45

ఆనంద్ దేవ‌ర‌కొండ ప‌రిచ‌యం అవుతున్న తొలి చిత్రం.. దొర‌సాని. విజ‌య్ దేవ‌ర‌కొండ త‌మ్ముడు ఆనంద్‌. ఈ సినిమాలో అత‌ని స‌ర‌స‌న రాజ‌శేఖ‌ర్ కూతురు శివాత్మిక న‌టించింది. తెలంగాణ‌లో దొరల పాల‌న సాగుతున్న స‌మ‌యంలో ఓ దొర కూతురు, ఒక పేద పోర‌డికి మ‌ధ్య జ‌రిగిన ప్రేమాయ‌ణం ఈ దొర‌సాని.

దొర‌సాని గురించి..

ఇది ఒక పీరియ‌డ్‌ ల‌వ్ స్టోరీ, రాజు, దొర‌సాని మ‌ద్య జ‌రిగిన ప్రేమ‌క‌థ‌. నిజ‌జీవితానికి ద‌గ్గ‌ర‌గా ఉండే ప్రేమ‌క‌థ‌.  క‌థ‌లోని స్వ‌చ్ఛ‌త‌, నిజాయితీ ఈ ప్రేమ‌క‌థ‌ను ముందుకు న‌డిపిస్తాయి. అన్నీ రియ‌ల్ లోకేష‌న్స్  లో షూటింగ్ చేసాము. ద‌ర్శ‌కుడు మ‌హేంద్ర ఎక్క‌డా ఫేక్ ఎమోష‌న్స్ ని రానీయ‌లేదు. క‌థ‌ను ద‌ర్శ‌కుడు ట్రీట్ చేసిన విధానం చాలా రియ‌లిస్టిక్ గా ఉంటుంది.

మొద‌టి ఆఫ‌ర్ ఇది కాదు

అన్న‌య్య (విజ‌య్ దేవ‌ర‌కొండ‌) అర్జున్ రెడ్డి సూప‌ర్‌హిట్ కాగానే నాకూ  కొన్ని ఆఫ‌ర్స్ వ‌చ్చాయి. కానీ అప్పుడు వాటిని సీరియ‌స్ గా తీసుకొలేదు. యాక్టింగ్ ఎక్స్ పీరియ‌న్స్ ఉందికానీ సినిమా ఎక్స్పీరియ‌న్స్ లేదు. అమెరికా నుంచి ఇండియాకి వ‌చ్చిన‌ టైం లో ద‌ర్శ‌కుడు మ‌హేంద్ర  క‌లిసి ఐదు గంట‌ల పాటు క‌థ చెప్పి న‌న్ను ఒప్పించాడు. సినిమా చూసే ముందు అన్న టెన్ష‌న్ ప‌డ్డాడు. కానీ సినిమా చూసిన త‌ర్వాత చాలా ఆనంద ప‌డ్డాడు. సినిమా చూసిన త‌ర్వాత నాకు అన్న ఇచ్చిన ఎన‌ర్జీకాన్ఫిడెన్స్ ని పెంచింది.

శివాత్మ‌కతో దూరమే
నేను, శివాత్మిక ఆడిష‌న్స్ చేసాము. ఆ క్యారెక్ట‌ర్స్ కి ఫిట్ అవుతాము అనే న‌మ్మ‌కం ద‌ర్శ‌క‌, నిర్మాత‌ల‌కు వ‌చ్చాకే మేము ప్రాజెక్ట్ లోకి వ‌చ్చాము. ఈ కథ‌లో రాజు, దేవ‌కి పాత్ర‌ల మ‌ద్య ఎక్క‌వ చ‌నువు ఉండ‌దు. అందుకే మాకు వ‌ర్క్ షాప్ లు విడివిడిగా నిర్వ‌హించారు.  షూటింగ్ లోకేష‌న్ లో కూడా పాత్ర‌ల మధ్య‌ గ్యాప్ ను మెయిన్ టైన్ చేసాము. మేము ప్రెండ్స్ అయితే ఆ ఫీల్ స్క్రీన్ మీద‌కు వ‌స్తుంద‌ని ఆ జాగ్ర‌త్త ప‌డ్డాం. ఇపుడు ఇద్ద‌రం మంచి ఫ్రెండ్స్ అయ్యాం.

అన్నదే ధైర్య‌మే
అన్న ప‌దేళ్ల పాటు స్ట్ర‌గుల్ అయి పైకొచ్చాడు. అన్న‌కు వ‌చ్చిన స‌క్సెస్ నాకు ధైర్యాన్నిచ్చింది.  టాలెంట్ ఉంటే స‌క్సెస్ అవ్వొచ్చు అనే న‌మ్మ‌కం క‌లిగింది.  

కామెంట్స్ కామ‌న్‌
సోష‌ల్ మీడియాలో ప్ర‌స్తుతం నా లుక్ గురించి, వార‌స‌త్వం గురించి నాపై కామెంట్స్ వ‌స్తున్నాయి. ఆ వ‌చ్చే కామెంట్స్ ని సీరియ‌స్ గా తీసుకోను. సినిమా రిలీజ్ అయ్యాక నా న‌ట‌న మీద వ‌చ్చే విమ‌ర్శ‌ల‌ను తీసుకుంటాను. సినిమా పై పూర్తి న‌మ్మ‌కం ఉంది.