ఎట్టకేలకు ఛాన్స్ దొరికింది

Anupama gets chance with Nikhil
Monday, December 23, 2019 - 15:00

అనుపమ పరమేశ్వరన్ గుర్తుందా...

ఇంకొన్ని రోజులాగితే నిజంగానే ఈ ప్రశ్న అడగాల్సి వస్తుందేమో. మెల్లమెల్లగా ఫేడవుట్ అయిపోతోంది ఈ మల్లూ బ్యూటీ. చూడచక్కని అందం, యాక్టింగ్ టాలెంట్ అన్నీ ఉన్నప్పటికీ పిసరంత అదృష్టం కలిసిరాక కెరీర్ లో కిందామీద పడుతోంది. రాక్షసుడు తర్వాత మళ్లీ ఈమె కెరీర్ లో గ్యాప్ వచ్చేసింది. మళ్లీ ఇన్నాళ్లకు అనుపమకు మరో ఛాన్స్ దక్కేలా ఉంది.

త్వరలోనే కార్తికేయ-2 ప్రాజెక్టుతో సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు నిఖిల్. ఈ మూవీకి ఇప్పటికే కాల్షీట్లు కేటాయించాడు. చందు మొండేటి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ ను తీసుకోవాలని అనుకుంటున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే దాదాపు అనుపమ ఫైనల్ అయినట్టే

కార్తికేయ సినిమాలో స్వాతి హీరోయిన్ గా నటించింది. తర్వాత ఆమె పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమైంది. ఇండోనేషియాలో సెటిల్ అయిపోయింది. మళ్లీ అలాంటి హోమ్లీ లుక్స్ ఉన్న హీరోయిన్ కోసం చూడగా, అనుపమ వీళ్ల దృష్టిలో పడింది. అలా కార్తికేయ-2లో అనుపమ సెట్ అయింది. త్వరలోనే దీనికి సంబంధించి అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వస్తుంది.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ మలయాళం, తమిళ భాషల్లో చెరో సినిమా చేస్తోంది. కార్తికేయ-2 ఓకే అయితే మరో తెలుగు ప్రాజెక్టు ఈమె ఖాతాలో చేరుతుంది.