అర్జున్‌రెడ్డిని తెలుగులో డ‌బ్ చేయ‌డమేంటి!

Arjun Reddy Tamil remake being dubbed into Telugu
Sunday, September 23, 2018 - 11:30

భావ దారిద్ర్యం అంటే ఇదే.  "అర్జున్‌రెడ్డి" సినిమాని త‌మిళంలో వ‌ర్మ పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఆ సినిమాని తెలుగులో కూడా డ‌బ్‌చేసి ఏక‌కాలంలో విడుద‌ల చేస్తారట‌. ఇంత‌క‌న్నా కామెడీ ఉంటుందా? "వ‌ర్మ" సినిమాని చేస్తున్న బాలా గొప్ప ద‌ర్శ‌కుడే. అందులో సందేహం లేదు. కానీ మ‌న ద‌గ్గ‌ర సంచ‌ల‌నం సృష్టించిన సినిమాని త‌మిళంలో తీసి మ‌ళ్లీ మ‌న భాష‌లో అనువదించి విడుద‌ల చేయ‌డం ఏంటి?

ద‌ర్శ‌కుడు సందీప్ వంగా తీసిన "అర్జున్‌రెడ్డి" ఒక కల్ట్ క్లాసిక్‌గా పేరు తెచ్చుకొంది. ఈ మ‌ధ్య కాలంలో అర్జున్‌రెడ్డి తీసుకొచ్చినంత పెనుమార్పు తెలుగులో మ‌రే సినిమా తీసుకురాలేదు. అందులో న‌టించిన విజ‌య్‌దేవ‌ర‌కొండ ఒవ‌ర్‌నైట్ యూత్‌కి ఐకాన్‌గా మారాడు. "అర్జున్‌రెడ్డి" క‌థ చాలా సింపుల్ స్టోరీ. ఇంకా చెప్పాలంటే అనురాగ్ క‌శ్య‌ప్ తీసిన "దేవ్ డి" ఛాయ‌లతో సాగుతుంది. కానీ సందీప్ వంగా తీసిన విధానం, క‌థ‌ని న‌డిపించే క్ర‌మంలో చేసిన ప్ర‌యోగాలు అద్భుతం. కొన్ని సీన్లు చాలా కాలం హాంటింగ్‌గా ఉంటాయి. ఇక సినిమా సౌండ్‌ట్రాక్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. అందుకే యూత్ విర‌గ‌బ‌డి చూశారు ఈ సినిమాని. క్రిటిక్స్ అంతా యూనినామస్‌గా పొగిడారు.

ఇలాంటి ఈ క‌ల్ట్ సినిమాని ఇపుడు విక్ర‌మ్ కొడుకు ధృవ్ హీరోగా త‌మిళంలో బాలా రీమేక్ చేస్తున్నాడు "వ‌ర్మ" అనే పేరుతో. "సేతు", "శివ‌పుత్ర‌డు" వంటి గొప్ప సినిమాలు తీసిన బాలా కెరియ‌ర్‌లో ఇది తొలి రీమేక్‌. ధృవ్‌ని తెలుగు ప్రేక్ష‌కుల‌కి చేయాల‌నే క్ర‌మంలో తెలుగులో హిట్ట‌యిన సినిమా రీమేక్‌నే డ‌బ్ చేసి వ‌ద‌ల‌డం అనేది విచిత్ర‌ చేష్ట‌.