ట్రెండ్ కు దూరంగా బాలయ్య

Balakrishna agrees to B Gopal?
Monday, March 9, 2020 - 18:30

ఊహించని దర్శకుడ్ని తెరపైకి తీసుకురావడం, కలలో కూడా ఊహించని హీరోయిన్లకు అవకాశాలివ్వడం బాలయ్య స్టయిల్. అతడు ఎప్పుడు ఎలాంటి సినిమాతో తెరపైకొస్తాడో, నందమూరి అభిమానులు కూడా గెస్ చేయలేరు. ఈసారి కూడా బాలయ్య అదే పనిచేశాడు. ట్రాక్ పై లోని బి.గోపాల్ ను లైన్లోకి తీసుకొచ్చే పనులు చేస్తున్నాడు.

అవును.. కొన్నాళ్లుగా సినిమాలకు దూరమైన బి.గోపాల్ కు అవకాశం ఇవ్వాలనుకుంటున్నాడట బాలయ్య. అతడి చేతిలో మెగాఫోన్ పెట్టి, తను ముఖానికి రంగేసుకోవాలనుకుంటున్నాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఫుల్ గా నడుస్తున్న ప్రచారం ఇదే. ఈ కాంబినేషనే కాస్త ఓల్డ్ అనిపిస్తుంటే.. ఈ కాంబోకు కథ అందిస్తున్న వ్యక్తి చిన్నికృష్ణ.

ఇతడు కూడా సినిమాలకు కథలు అందించి చాలా రోజులైంది. రీసెంట్ గా చిన్నికృష్ణ అందించిన కథలు (స్టోరీలైన్స్ మాత్రమే) పెద్దగా క్లిక్ అయిన దాఖలాలు కూడా లేవు. ఇప్పుడీ ముగ్గురు కలిసేలా ఉన్నారు. బాలయ్య కోసం చిన్నికృష్ణ రాసిన కథను బి.గోపాల్ డైరక్ట్ చేయబోతున్నారు.

బాలయ్య-బి.గోపాల్ కాంబోను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. గతంలో వీళ్లిద్దరూ కలిసి రౌడీ ఇన్ స్పెక్టర్, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, లారీ డ్రైవర్ లాంటి బ్లాక్ బస్టర్లు ఇచ్చారు. ఏమో ఈసారి కూడా ఈ కాంబినేషన్ బ్లాక్ బస్టర్ అవుతుందేమో. గుర్రం ఎగురుతుందేమో.. ఎవరికి తెలుసు.