అభిమానుల‌తో బాల‌య్య మీటింగ్‌

Balakrishna to meet fans
Wednesday, February 27, 2019 - 00:30

ఎన్టీఆర్ బ‌యోపిక్ చిత్రాలు ఎందుకింత దారుణంగా ప‌రాజ‌యం పాలు అయ్యాయి. మొద‌టి భాగం ఎంతో కొంత క‌లెక్ష‌న్ల‌ను పొందింది. ఓపెనింగ్స్ విష‌యంలో ఆ సినిమా బాల‌య్య రేంజ్‌కి త‌గ్గ‌ట్లే సాధించింది. కానీ రెండో భాగ‌మే పెద్ద షాక్‌. బాల‌య్య సినిమా మొద‌టి ఐదు రోజుల‌కి కూడా మూడు కోట్ల రూపాయ‌లు సాధించ‌క‌పోవ‌డం అంటే అది బియాండ్ షాక్ అని చెప్పాలి. ఘోర అవ‌మానం ఇది. 

అందుకే, ఎప్పుడూ లేనిది బాల‌య్య ఇపుడు తీవ్రంగా క‌ల‌వ‌ర‌పడుతున్నాడు. గ‌తంలో బాల‌య్య ఎన్నో అప‌జ‌యాలు చూశాడు. కానీ అంత‌కుముందెపుడూ అభిమానుల‌తో మీటింగ్‌లు పెట్ట‌లేదు. మ‌రో హిట్‌తో వారిని ఖుషీ చేసేవాడు. ఐతే ఇపుడు కాలం మారింది, డేంజ‌ర్ బెల్స్ బాగా గ‌ట్టిగా మోగుతున్నాయి. అందుకే మొద‌టి సారి ఆయ‌న త‌న అభిమానుల‌తో ప్ర‌త్యేకంగా డిన్న‌ర్ మీటింగ్ పెట్ట‌నున్నాడ‌ట‌. కొంత‌మంది అభిమానుల‌ను డిన్న‌ర్‌కి పిలిచి వారితో మాట్లాడుతాడ‌ట‌.

క‌నీస ఒపెనింగ్స్ కూడా రాలేదంటే.. త‌న సొంత అభిమానులు కూడా థియేట‌ర్ వైపు చూపు వెయ్య‌లేద‌న్న విష‌యం బాల‌య్య‌కి అర్థ‌మ‌యింది. అందుకే వారితో మాట్లాడి....అస‌లు అభిమానులు ఎందుకు ఈ సినిమాకి దూర‌మ‌య్యారు అనేది తెలుసుకుంటాడ‌ట‌. మాటిమాటికీ అభిమానుల‌పై చేయి చేసుకోవ‌డం వ‌ల్ల వారు హ‌ర్ట్ అవుతున్నారా అనేది కూడా అడుగుతాడా అనేది చూడాలి. 

ఏదీ ఏమైనా బాల‌య్య నిజంగా అభిమానుల‌ను క‌లిసి.... వారి అభిప్రాయాల‌ను తెలుసుకోవ‌డం మంచి సంప్ర‌దాయం. మెగాస్టార్ చిరంజీవి గ‌తంలో తరుచుగా ఇలా చేసేవారు. త‌మిళ‌నాట ఈ సంప్ర‌దాయం ఇప్ప‌టికీ ఉంది. ర‌జ‌నీకాంత్‌, క‌మ‌ల్‌, విజ‌య్‌, అజిత్‌లు ఇలా చేస్తుంటారు.