కంచుకోట‌లో బాల‌య్య‌కి క‌ష్టాలా?

Balakrishna sweating hard in Hindupur
Tuesday, March 19, 2019 - 09:45

హిందూపూర్‌లో నంద‌మూరి బాల‌కృష్ణ మ‌ళ్లీ ఎమ్మెల్యేగా పోటీపడుతున్నారు. ఐతే ఈ సారి ఆయ‌న‌కి చెమ‌ట‌లు ప‌డుతున్నాయి. వైఎస్సార్సీ నుంచి ఈ సారి గ‌ట్టి పోటీ ఉంద‌ట‌. ఈ నియోజ‌క‌వ‌ర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట‌. 1985 నుంచి ఇక్క‌డ వ‌రుస‌గా తెలుగుదేశం పార్టీనే గెలుస్తుంది. వైఎస్‌రాజ‌శేఖ‌ర్‌రెడ్డి బ‌లంగా ఉన్న కాలంలోనూ తెలుగుదేశం పార్టీ ఇక్క‌డ ఓడిపోలేదు. వైఎస్సార్ వ‌ల్లే టీడీపీని ఓడించ‌డం కాలేదిక్క‌డ‌. అంత స్ట్రాంగ్ టీడీపీ అక్క‌డ‌. 

తెలుగుదేశం పార్టీ అంటే హిందూపూర్‌లో కోసుకునే రేంజ్‌లో అభిమానం ఉంది.  ఐతే సిట్టింగ్ ఎమ్మెల్యే బాల‌య్య‌పై స్థానికంగా చాలా వ్య‌తిరేక‌త ఉంద‌ట‌. ముఖ్యంగా ప‌ట్ట‌ణ ప్రాంత ఓట‌ర్ల‌లో బాల‌య్య‌పై చాలా నెగిటివ్ ఫీలింగ్ ఉంది. ఇక్క‌డ తాగునీరు పెద్ద స‌మ‌స్య‌. దాన్ని ప‌రిష్క‌రించేందుకు బాల‌కృష్ణ  కొంత కృషి చేసినా.....ఆయ‌న పీఏ చేసిన అవినీతి వ‌ల్ల స‌మ‌స్య వ‌చ్చింది. బాల‌య్య పేరు చెప్పి ఆయ‌న పీఏ అక్క‌డ చేసిన నిర్వాకాలు నంద‌మూరి హీరో ప్ర‌తిష్ట‌ని మ‌స‌క‌బార్చాయిట‌.

బాల‌య్య రెండోసారి గెల‌వాలంటే ఎంతో క‌ష్ట‌ప‌డాలి. ఈ నెల 22న ఆయ‌న త‌న నామినేష‌న్‌ని ద‌ఖ‌లు చేయ‌నున్నారు. తెలుగుదేశం పార్టీ కంచుకోట‌లో గెలుపు కోసం బాల‌య్య సాధార‌ణంగా క‌ష్ట‌ప‌డాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. కానీ ఈ సారి ఏమాత్రం ఏమ‌రుపాటుగా ఉన్న కంచుకోట బ‌ద్ద‌లవుతుంద‌నే సంకేతాలు వ‌స్తుండ‌డంతో బాల‌కృష్ణ త‌న పూర్తి ఫోక‌స్‌ని ఇక్క‌డే నిలిపారు.