మ‌ళ్లీ చెయ్యి లేపిన బాల‌య్య‌

Balakrishna threatens a journalist
Wednesday, March 27, 2019 - 22:15

నంద‌మూరి బాల‌కృష్ణ‌కి కోపం వ‌చ్చిందంటే ఎదుటి వ్య‌క్తి చెంప ప‌గలాల్సిందే. ఇప్ప‌టికే ఇలా చెయ్యి చేసుకోని అనేక‌సార్లు వివాదంలో ఇరుక్కున్నారు. ఐనా బాల‌య్య తీరు మార‌డం లేదు. మొన్న‌టి వ‌ర‌కు సొంత ఫ్యాన్స్‌పైనే చెయ్యి చేసుకున్న బాల‌కృష్ణ‌..తాజాగా ఒక మీడియా కెమెరామేన్‌ని కొట్ట‌బొయ్యాడు. బుధ‌వారం బాల‌య్య హిందూపురంలో ప్ర‌చారం చేస్తుండ‌గా జ‌రిగింది ఈ సంఘ‌ట‌న.

తెలుగుదేశం పార్టీ త‌ర‌ఫున మ‌రోసారి ఎమ్మెల్యేగా బ‌రిలోకి దిగారు బాల‌కృష్ణ‌. త‌న సిట్టింగ్ స్థానాన్ని నిల‌బెట్టుకోవాల‌ని బాల‌య్య ప్ర‌య‌త్నిస్తున్నారు. ఒక ప్ర‌చార కార్య‌క్ర‌మం నిర్వ‌హించి బ‌య‌టికి వ‌స్తుండ‌గా...అక్క‌డ గుమికూడిన చిన్నారుల‌ను బాల‌య్య బౌన్స‌ర్స్ తోసిపారేశారు. అలా పిల్ల‌ల‌ను తోస్తున్న దృశ్యాల‌ను కెమెరామేన్ చిత్రీక‌రిస్తుండ‌డాన్ని బాల‌య్య గ‌మ‌నించి..ఆ కెమెరామేన్‌పై బూతుల బాంబులు వ‌దిలారు. 

డిలీట్ చెయ్యి లేక‌పోతే న‌రికి పోగులు పెడుతా అని ఆ జ‌ర్న‌లిస్ట్‌ని బాల‌య్య బెదిరించారు. అంతేకాదు, నాకు క‌త్తి ప‌ట్ట‌డం తెలుసు, బాంబులు వెయ్య‌డం తెలుసు అన‌డం కూడా వీడియోలో రికార్డు అయింది. ఆ వీడియో ఇపుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. ఇన్ని సార్లు వివాదంలో ఇరుక్కున్న బాల‌య్య తీరు మార‌డం లేదు. ఎవ‌రూ కేసు పెట్టేందుకు కూడా ధైర్యం చేయ‌డం లేదు.