మేకప్ ... గెటప్ చూసుకోకపోతే ఎలా

Balakrishna wigs and getup issues
Saturday, December 21, 2019 - 18:45

బాలయ్య సినిమాల్లో కొత్తదనం ఆశించడం అంటే, ఎడారిలో మినరల్ వాటర్ కోసం వెయిట్ చేయడమే. ఈసారి కూడా అదే రిపీటైంది. రూలర్ కి వెళ్తే, రూళ్లకర్ర ఇచ్చుకొని బొప్పికట్టేలా కొట్టాడు అనేది జనం మాట.

ఫక్తు రొటీన్ స్టోరీ. దీనికి తోడు ఉన్న చిన్న ట్విస్ట్ ను కూడా మొదటి 10 నిమిషాల్లోనే రివీల్ చేశారు. అయినప్పటికీ ఆడియన్స్ భరించారు. దీనికి కారణం ఫస్టాఫ్ లో బాలయ్య గెటప్ తో పాటు పడతాడు అనే సాంగ్ బాగుండడమే. అయితే సెకెండాఫ్ లో ఎప్పుడైతే ధర్మ అంటూ మరో బాలయ్య, స్పెషల్ విగ్గుతో ఎంటరయ్యాడో అప్పుడే జనాలకు అర్థమైపోయింది. ఇక అక్కడ్నుంచి ఒకటే బాదుడు. బాల.. మాకేందీ గోల అంటూ గగ్గోలు పెడుతున్నా వదలడే. ఎలాంటి ట్విస్టులు, టర్నులు లేకుండా, బలమైన సన్నివేశాలు మచ్చుకైనా చూపించకుండా.. అరుపులు-పెడబొబ్బలతో సినిమా నడుస్తుంటే.. జనాలు ఆశగా ఎగ్జిట్ డోర్ వైపు చూడడం మొదలుపెట్టారు.

కథల విషయంలో బాలయ్య నుంచి ఎలాగూ కొత్తదనం ఆశించలేం. తాజా ఆణిముత్యంతో ఆ విషయం మరోసారి ప్రూవ్ అయిపోయింది. కనీసం మేకప్, గెటప్ విషయంలోనైనా బాల జాగ్రత్తలు తీసుకోకపోతే ఎలా... అంత అభిమాన గణం ఉన్నప్పుడు మినిమమ్ కేర్ తీసుకోవాలి కదా.