బాల‌య్య డైలాగ్ వ‌ల్లించిన బండ్ల గ‌ణేష్‌

Bandla Ganesh responds on Congress's defeat
Tuesday, December 18, 2018 - 14:15

"స‌ర్‌..స‌ర్లే ...ఎన్నెన్నో అనుకుంటాం. అన్ని జ‌రుగుతాయా ఏమిటి" అని వీర‌భ‌ద్ర సినిమాలో నంద‌మూరి బాల‌కృష్ణ ఒక డైలాగ్ చెపుతాడు. ఆ సినిమాలో బండ్ల గ‌ణేష్ కూడా న‌టించాడు. ఇపుడు బండ్ల గ‌ణేష్ రియ‌ల్‌లైఫ్‌లో బాల‌య్య డైలాగ్ వ‌ల్లిస్తున్నాడు.

ఎన్నికల టైమ్‌లో వంద అంటాం.. అన్నీ చేస్తామా? ఏమిటి? అని తాజాగా స్పందించాడు బండ్ల గ‌ణేష్‌. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ త‌ప్ప‌కుండా గెలుస్తుంద‌ని జ‌ర్న‌లిస్ట్‌ల‌తో, మీడియాతో బెట్టింగ్‌లు క‌ట్టాడు బండ్ల‌. అంతేకాదు, ఒక‌వేళ తెరాస గెలిస్తే సెవ‌న్ ఓ క్లాక్ బ్లేడ్‌తో త‌న గొంతు కోసుకుంటా అని శ‌పథం చేశాడు.

వైకుంఠ ఏకాద‌శి నాడు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్తానానికి వ‌చ్చిన బండ్ల గ‌ణేష్‌ని జ‌ర్న‌లిస్ట్‌లు క‌దిపారు. ఏమైంది మీ శ‌ప‌థం అని అడిగితే..పై బాల‌య్య డైలాగ్ చెప్పాడు. కార్య‌క‌ర్త‌ల‌కి గెలుప‌పై కాన్పిడెన్స్ పెర‌గాల‌ని ఏదేదో అన్నాన‌ని, కానీ అది కాస్త ఓవ‌ర్ అయింద‌ని ఇపుడు కూల్‌గా స‌మాధానం ఇచ్చాడు.

అస‌లు బండ్ల గ‌ణేష్ ఓవ‌ర్ యాక్ష‌న్ చూసే చాలామంది కాంగ్రెస్‌పై జాలిప‌డ్డారు. ఇలాంటి రాజ‌కీయ అజ్ఞానిపై కాంగ్రెస్ ఆధార‌ప‌డాల్సిన స్థితికి చేరుకుంద‌ని అసహ్యించుకున్నారు. పోల‌వ‌రంకి, కాళేశ్వ‌రంకి తేడా తెలియ‌దు బండ్ల‌కి. మీడియా చానెల్స్ ఇత‌న్ని ప్రోత్సాహించాయి. ఎందుకంటే తాను ఏమి మాట్లాడుతున్నానో త‌న‌కే తెలియ‌ని అర్భ‌కుల‌తోనే మీడియాకి ఆనందం. ఆ పాత్ర‌ని ఈ సారి బండ్ల పోషించాడు.