టాలీవుడ్ లో ఇది బ్లాక్ ఫ్రైడే

Black Friday in Tollywood history
Friday, March 20, 2020 - 17:30

చిన్నదో పెద్దదో, చెత్తదో మంచిదో... శుక్రవారమైతే చాలు ఏదో ఒక సినిమా థియేటర్లలోకి వచ్చేది. అంతాఇంతో సందడి కనిపించేది. కానీ ఈరోజు మాత్రం టాలీవుడ్ చరిత్రలో బ్లాక్ ఫ్రైడేగా నిలిచిపోతుంది. కరోనా దెబ్బకు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లన్నీ మూతపడ్డంతో, ఈరోజు ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. ఇలా ఓ శుక్రవారం పూట ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకుండా వెలవెలబోవడం టాలీవుడ్ చరిత్రలో ఇదే తొలిసారి కావొచ్చు.

అంతా సజావుగా సాగితే ఈపాటికి V సినిమా హంగామా ఓ రేంజ్ లో ఉండేది. ఉగాదికి నాని సినిమాతో బాక్సాఫీస్ గ్రాండ్ గా ప్రారంభమయ్యేది. ఆ వెంటనే మరో వారం రోజులకు నిశ్శబ్దం, ఉప్పెన సినిమాలతో థియేటర్లు కళకళలాడేవి. కానీ ఇప్పుడు ఆ కళ లేదు. ఏ థియేటర్ వద్ద చూసినా స్మశాన నిశ్శబ్దం. ఈ చేదు శుక్రవారాన్ని టాలీవుడ్ ఎన్నటికీ మరిచిపోలేదు.

రిలీజ్ లేకపోయినా కనీసం షూటింగ్స్ తోనైనా నెట్టుకొద్దామంటే ఆ అవకాశం కూడా లేకుండా చేసింది కరోనా. దీంతో టాలీవుడ్ మొత్తం డ్రై అయిపోయింది. దీనికి తోడు 31వరకు ఎలాంటి షూటింగ్స్ పెట్టుకోకూడదని ఫిలింఛాంబర్ మరోసారి ప్రకటించింది. వాస్తవానికి 21వరకు మాత్రమే షూటింగ్స్ కు లాక్ డౌన్ ప్రకటించారు. అయితే ఈరోజు మరోసారి సమావేశమైన ఫిలింఛాంబర్ పెద్దలు.. 31వరకు ఎలాంటి షూటింగ్స్ చేయకూడదని మరోసారి నిర్ణయించారు.