బోయ‌పాటికి, వినాయ‌క్‌కీ ఝ‌ల‌క్‌

Both Boyapati and Vinayak get jolt
Thursday, April 25, 2019 - 22:30

బాల‌య్య నెక్స్ట్ సినిమా నాదే అంటూ ఒక‌ప్ప‌టి అగ్ర ద‌ర్శ‌కుడు వి.వి.వినాయ‌క్ ఏడాదిన్న‌ర కాలంగా భావిస్తున్నారు. కానీ ఎప్ప‌టిక‌పుడు నెక్స్ట్‌ని నెక్స్ట్ అంటూ ముందుకెళ్తున్నాడు బాల‌య్య‌. ఇపుడు వినాయ‌క్‌తో పాటు బోయ‌పాటికి కూడా ఝ‌ల‌క్ ఇచ్చాడు బాల‌కృష్ణ‌. 

బోయ‌పాటి - బాల‌కృష్ణ కాంబినేష‌న్లో అయితే సినిమా ఉంది. కానీ అది ముందు ప్ర‌య‌రిటీ కాదు. కె.ఎస్‌.ర‌వికుమార్‌తో సినిమా మొద‌లుపెట్టి ...కొంత భాగం పూర్తి చేశాకే బోయ‌పాటి సినిమాని షురూ చేస్తాడు బాలయ్య‌. ఇక వినాయ‌క్ సినిమా గురించి ఊసే లేదు. వినాయ‌క్‌ని బాల‌య్య వ‌ద్ద‌కి తీసుకెళ్లిందే నిర్మాత సి.క‌ల్యాణే. ఆయ‌నే ఇపుడు కె.ఎస్‌.ర‌వికుమార్ మూవీని నిర్మిస్తున్నారు. అంటే వినాయ‌క్ సినిమా మ‌రోసారి వెన‌క్కి వెళ్లిన‌ట్లే. అస్స‌లు ఎప్ప‌టికైనా మొద‌ల‌వుతుందా అని అడిగితే... చూస్తూనే ఉండండి నిరంత‌ర వార్తా అప్‌డేట్స్ అని స‌మాధానం వ‌స్తుంది.

ఒక‌పుడు ఓ రేంజ్‌లో వెలిగిన వినాయ‌క్‌కి ఇపుడు సినిమాలు ద‌క్క‌డం లేదు. ఈ మ‌ధ్య ర‌వితేజ ఆయ‌న‌తో మూవీ చేసేందుకు ముందుకొచ్చినా..అది కూడా ఇంచ్ ముందుకు క‌ద‌ల‌డం లేదు. అస్స‌లే ర‌వితేజ కెరియ‌ర్ ఒక అడుగు ముందుకు ..మూడు అడుగులు వెన‌క్కి అన్న‌ట్లు సాగుతోంది.