బోయ‌పాటి యాడ్స్ క్లిక్ అయ్యాయా?

Boyapati does ads for TDP
Wednesday, March 27, 2019 - 11:15

ఇది ఎన్నిక‌ల సీజ‌న్‌. ఇపుడు ఏ టీవీ పెట్టిన ఎన్నిక‌ల గురించే వార్త‌లు. మ‌ధ్య‌లో వ‌చ్చే యాడ్స్ కూడా ఎన్నిక‌ల‌కి సంబంధించిన‌వే ఎక్కువ‌గా ఉంటున్నాయి. అందులోనూ తెలుగుదేశం పార్టీకి చెందిన యాడ్స్ ఎక్కువ‌గా ప్ర‌సారం అవుతున్నాడు. గోమాత‌ యాడ్ ట్రాలింగ్‌కి గుర‌యినా  మిగ‌తావ‌న్నీ...బాగానే ఆక‌ట్టుకుంటున్నాయ‌ని అంటున్నారు తెలుగుదేశం శ్రేణులు.

ప్ర‌స్తుతం టీవీల్లో ప్ర‌సారం అవుతున్న యాడ్స్‌లో అధిక భాగం ద‌ర్శ‌కుడు బోయ‌పాటి డైర‌క్ట్ చేసిన‌వే. "విన‌య విధేయ రామ" సినిమా విడుద‌లై, ప‌రాజ‌యం పాలు కాగానే... బోయ‌పాటిని ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు పిలిపించారు. తెలుగుదేశం ప్ర‌క‌ట‌న‌ల‌న్నీ మీరు ద‌గ్గ‌రుండి చేయాల‌ని బాబు బోయపాటిని కోరారు. దాంతో అమ‌రావతిలోనూ, హైద‌రాబాద్‌లోనూ ఈ ప్ర‌క‌ట‌న‌లు షూట్ చేశాడు బోయపాటి. మ‌రికొన్ని కూడా రెడీ చేస్తున్నాడ‌ట‌.

బోయ‌పాటి ప‌క్కా నంద‌మూరి అభిమాని. అలాగే హార్డ్‌కోర్ తెలుగుదేశం పార్టీ అభిమాని. సో.. బాల‌య్య‌, బాబుల‌తో ఉన్న అనుబంధంతో పాటు "ఇత‌ర అంశాల" కార‌ణంగా మ‌న‌సు పెట్టి వాటిని రూపొందించాడు. మ‌రి ఈ ప్ర‌క‌ట‌న‌లు ఇపుడు బాగానే ఆక‌ట్టుకుంటున్నా... అవి ఫ‌లితాల‌ను ఇస్తాయా అన్న‌ది తెలుసుకోవాలంటే మే 23 వ‌ర‌కు ఆగాలి.