బాలయ్య అఘోరా గెటప్ నిజమే: బోయపాటి

Boyapati talks about association with Balakrishna
Thursday, April 30, 2020 - 22:45

బాలయ్యకు కొత్తదనం అంటే చాలా ఇష్టమని... కొత్త కథలు, కొత్త పాత్రల కోసం ఎప్పుడూ ఎదురుచూస్తుంటాడని అంటున్నాడు బోయపాటి. "సింహా" సినిమా పదేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఛానల్ తో  మాట్లాడిన ఈ దర్శకుడు.. బాలయ్యలో తనకు నచ్చిన అంశాలతో పాటు.. కొత్త సినిమా సంగతులు బయటపెట్టాడు. బోయపాటి చెప్పిన టాప్-10 హైలెట్స్ చూద్దాం. 

1. మీ హిట్ కాంబో వెనక సీక్రెట్ ఏంటి?
మాది హిట్ కాంబినేషన్ ఎలా అయిందనేది సీక్రెట్ కాదు. బాలయ్య ఒకటి నమ్మారంటే చేసేస్తారు. దీనికితోడు క్లారిటీ కూడా ఉండాలి. ఫైట్ అయినా, సాంగ్ అయినా, సీన్ అయినా ముందుగా ఆ డిపార్ట్ మెంట్ తో మాట్లాడిన తర్వాతే బాలయ్య ముందు ప్రజెంటేషన్ పెడతాం. ఒకసారి ఆయన నమ్మారంటే ఇక ఆ సెటప్ ను కదిలించరు. ఆయన అంతలా నమ్ముతారు కాబట్టే మాకు మరింత బాధ్యత. అంత నమ్మారు కాబట్టే ఎన్ని రీటేక్స్ అయినా చేస్తారు. అదే మా హిట్ సీక్రెట్ అనుకుంటా.

2. బాలయ్యతో సినిమా చేసినప్పుడు మీరు దేనిపై దృష్టి పెడతారు?
బాలయ్యతో సినిమా అనగానే నేను ఆయన బాడీ లాంగ్వేజ్, డిక్షన్ మీద మాత్రమే ఫోకస్ చేస్తాను. ఆయన బాడీ లాంగ్వేజ్, మేనరిజమ్స్ నుంచే డైలాగ్స్ వస్తాయి. అలా ఆయన యాటిట్యూడ్ నుంచి వచ్చినవే తప్ప, బయట నుంచి నేనేదో తీసుకొచ్చి డైలాగ్స్ పెట్టినట్టు ఉండవు. బాలయ్య మీద ఫోర్స్ పనికిరాదనేది నా నమ్మకం. బాలయ్య బాడీ లాంగ్వేజ్ పడితే హిట్ గ్యారెంటీ.

3. ఓ కథ చెప్పినప్పుడు బాలయ్యను ఎలా ఒప్పిస్తారు?
బాలయ్యను కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు. బాలయ్యను ఒప్పించడం చాలా ఈజీ. డైరక్టర్ కు కథ మీద క్లారిటీ ఉందని బాలయ్య నమ్మితే చాలు. కథ కూడా ఆయన పూర్తిగా వినరు. చాలా తక్కువ టైమ్ వింటారు. కథ మీద వీళ్లకు గ్రిప్ ఉందని నమ్మితే చాలు ఓకే చెబుతారు. తన క్యారెక్టర్ ఏంటి, గెటప్ ఏంటని మాత్రమే ఆడుగుతారు. మిగతా విషయాలేవీ పట్టించుకోరు.

4. మిగతా దర్శకులతో బాలయ్య సినిమాలు ఎందుకు ఫెయిల్ అవుతుంటాయి?
బాలయ్య చాలా సరదా మనిషి. కాకపోతే కథపై క్లారిటీ ఉంటేనే. మేకర్స్ కు ఆ క్లారిటీ లేకపోతే బాలయ్యతో కష్టం. కథకు, ఆయన బాడీ లాంగ్వేజ్ కు మధ్య కన్ఫ్యూజన్ వచ్చిందంటే ఇక ఇబ్బంది అయిపోతుంది. ఆ సినిమా దైవాధీనం.

5. బాలయ్యకు 30 నిమిషాల కంటే ఎక్కువ నెరేషన్ ఇవ్వరంట, నిజమేనా?
బాలయ్యకు కొత్తదనం అంటే ఇష్టం. కొత్త కథలంటే ఇష్టం. కొత్త క్యారెక్టర్లు ఇష్టం. నేను విజయవాడ పెళ్లిలో ఉన్నప్పుడు ఫోన్ చేసి రమ్మన్నారు. మరుసటి రోజు వస్తానని చెప్పి వెళ్లాను. కథ చెప్పకూడదని, క్యారెక్టరైజేషన్ చెప్పాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. కొత్తగా ఫీలయ్యారు. "సింహా" కథను ఆయన 20 నిమిషాలే విన్నారు. చేస్తున్నాం అన్నారు. "లెజెండ్" కూడా అంతే. 20-25 నిమిషాల్లో ఓకే అన్నారు. ఆయనలో ఉన్న క్వాలిటీ అదే. బాలయ్య కొత్తదనం ఎంకరేజ్ చేస్తారు. కొత్త కథ అంటే చాలు ఆయన ప్రోత్సహిస్తారు. ఈ క్రమంలో కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినా ఆయన తగ్గరు. కొత్త కథ అనిపిస్తే ఏ దర్శకుడైనా అవకాశం ఇచ్చేస్తారు.

6. బాలయ్యతో చేస్తున్న కొత్త సినిమా గురించి చెప్పండి?
మా ఇద్దరి కాంబినేషన్ లో ఆడియన్స్ "సింహా" చూశారు. ఆ తర్వాత "లెజెండ్" చూశారు. ఈసారి అంతకుమించి కొత్తదనం చూపించాలి. ఆ దిశగానే వందశాతం కష్టపడ్డాను. కొత్తదనం కోసం క్యారెక్టరైజేషన్ నుంచి కథ చెప్పాలని నిర్ణయించుకున్నాను. కొత్త సినిమాలో బాలయ్య మరింత కొత్తగా కనిపిస్తారు.

7. ఇందులో బాలయ్య అఘోరాగా కనిపిస్తారనే టాక్ నడుస్తోంది?
నిజమే.. అఘోరా టైపు క్యారెక్టర్ ఒకటి ఉన్నమాట వాస్తవమే. దాన్ని ఎలా డిజైన్ చేశాం, ఎలా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. "సింహా", "లెజెండ్" నుంచి కొంచెం బయటకొచ్చి కొత్తగా ఏదైనా చేయాలని అనుకున్నప్పుడు నాకు ఆ పాత్ర తట్టింది. కాకపోతే సెటప్ అంతా కొత్తగా ఉంటుంది. కొత్తదనం కావాలంటే ఈమాత్రం ట్రై చేయాల్సిందే.

8. క్వారంటీన్ గ్యాప్ లో ఏం చేస్తున్నారు?
ఇలాంటి గ్యాప్ దొరకడం నిజంగా అదృష్టం. సినిమావాళ్లకు ఇలాంటి గ్యాప్ వస్తే కచ్చితంగా ఉదయం నుంచి రాత్రి వరకు వర్క్ చేస్తారు. నా వరకు నేను కూడా అదే చేశాను. మరిన్ని ఇన్ పుట్స్ తీసుకున్నాను. మొత్తం పేపర్ మీద పెడుతున్నాం. దీంతో పాటు ముందునుంచే అనుకున్న కొన్ని కథల్ని పాలిష్ చేయడం స్టార్ట్ చేశాం. ప్రస్తుతానికైతే బాలయ్య సినిమాపైనే కూర్చున్నాం. ఒక షెడ్యూల్ అయిపోయింది. మంచి ఎపిసోడ్, 2 సీన్లు అయిపోయాయి.

9. మెగాస్టార్ తో సినిమా గురించి?
ప్రతి డైరక్టర్ ప్రతి హీరోకు ఓ కథ చేసుకుంటాడు. ఏ హీరోను ఎలా చూపించాలో ఓ ఐడియాతో ఉంటాడు. ఎటొఛ్చి ఆ టైమ్ రావాలి. అలాంటి టైమ్ వచ్చినప్పుడు కచ్చితంగా వాడుకుంటా. మెగాస్టార్ తో సినిమా ఛాన్స్ వస్తే వదిలేది లేదు.

10. సింహా సినిమా హిట్టైనప్పుడు బాలయ్య రియాక్షన్ ఏంటి?
బాలయ్య సినిమా రిజల్ట్ వరకు వెయిట్ చేయరు. సెట్స్ లోనే ఆయనకు తెలిసిపోతుంది. పైకి ఎంత సరదాగా కనిపించినా, తన సినిమా ఎలా ఉండబోతోందో ఆయన మనసులో ఊహించుకుంటారు. ఈ విషయంలో ఆయన మైండ్ లో ఎప్పుడూ ఓ లేయర్ అలా తిరుగుతుంది. సింహా విడుదల వరకు ఆయన వెయిట్ చేయలేదు. షూటింగ్ టైమ్ లోనే నేను స్క్రీన్ ప్లే ఆర్డర్ ప్రకారం షూటింగ్ చేశాను. మార్కెట్ ఫైట్ పూర్తయిన వెంటనే ఆయనకు అర్థమైపోయింది.