బ్ర‌హ్మానందం ఆరోగ్యం మెరుగ్గా ఉంది!

Brahmanandam's condition is stable
Thursday, January 17, 2019 - 15:15

హాస్య నటుడు డా: బ్రహ్మానందంకి ఇటీవ‌ల హార్ట్ స‌ర్జ‌రీ జ‌రిగింది. ఈ వార్త తెలిసి అంద‌రూ క‌ల‌వ‌ర‌ప‌డ్డారు. అయితే ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది అని ఆయన తనయుడు హీరో గౌతమ్ తెలిపారు.

కొన్ని నెలలుగా  ఛాతిలో అసౌకర్యంగా అనిపించడంతో హైదరాబాద్‌లోని ప్రముఖ డాక్టర్‌ని సంప్రదించారు  బ్రహ్మానందం. వారి సలహా మేరకు శస్త్ర చికిత్స చేయించు కోవాలని నిర్ణయించుకున్నారు. దేశంలోనే అత్యుత్తమమైన ముంబైలోని ‘ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ ‘ లో   సోమవారం ( 14.1.19 ) నాడు గుండె ఆపరేషన్‌ విజయవంతంగా పూర్తయింది.

ప్రముఖ హృదయ చికిత్స  నిపుణులు శ్రీ రమాకాంత్ పాండా  బ్రహ్మానందం గారికి శస్త్ర చికిత్స చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఐసీయు నుంచి సాధారణ గదికి మార్చటం జరిగింది అని తెలిపారు గౌత‌మ్‌

"నాన్నగారికి శస్త్ర చికిత్స జరిగిందని తెలిసి  అభిమానులు, శ్రేయోభిలాషులు, సినీ పరిశ్రమ లోని ప్రముఖులు అందరూ ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేయటం మొదలు పెట్టారు. అందరి ప్రేమాభిమానాలు, ఆశీస్సులు వల్ల  నాన్నగారి ఆరోగ్యం చాలా మెరుగ్గా ఉందని, వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నా,"మ‌న్నారు గౌత‌మ్‌.

బ్రహ్మానందం కుమారులు రాజా గౌతమ్, సిద్దార్థ్‌లు తండ్రితో పాటు ముంబైలో ఉన్నారు.