బాబు అందులో అలా ఇందులో ఇలా

Chandrababu Naidu to appear in two NTR movies
Friday, February 15, 2019 - 21:45

వచ్చే వారం (22న) "మహానాయకుడు" వచ్చేస్తోంది. ఆ సినిమాతో పాటు "లక్ష్మీస్ ఎన్టీఆర్" ట్రయిలర్ కూడా వస్తోంది. ఆ వెంటనే కొన్ని రోజుల గ్యాప్ లో ఆ సినిమా కూడా వచ్చేస్తుంది. రెండూ ఎన్టీఆర్ జీవితానికి చెందిన సినిమాలే. కానీ ఇప్పుడు అందరి దృష్టి ఎన్టీఆర్ పై లేదు. కేవలం చంద్రబాబు పాత్రలపైనే ఉంది. అవును.. ఓ కథలో చంద్రబాబుది పాజిటివ్ పాత్ర‌, మరో కథలో చంద్రబాబు విలన్.

ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలో చంద్రబాబుది కీల‌క‌మైన పాత్ర‌. ఎన్టీఆర్ కు అతడు రైట్ హ్యాండ్. రాజకీయాల్లో చంద్రబాబు సలహాల మీదటే ఎన్నో మంచి పనులు చేస్తుంటారు ఎన్టీఆర్. చిన్న అల్లుడి మాట‌ని ఆయ‌న వేదంగా భావిస్తారు. ఇది మ‌హానాయ‌కుడులో మ‌నం చూడ‌నున్న కోణం.

ఇప్పుడు ఇదే చంద్రబాబును రివర్స్ లో చూడాలనుకుంటే లక్ష్మీస్ ఎన్టీఆర్ చూడాలి. ఇందులో చంద్రబాబు వెన్నుపోటుదారుడు. దర్శకుడు వర్మ అలానే చూపించాడు. "జీవితంలో నేను చేసిన అతిపెద్ద తప్పు వాడిని నమ్మడం" లాంటి డైలాగ్ లు కూడా ఎన్టీఆర్ పాత్రధారితో చెప్పించాడు. ఇలా ఒకే సీజన్ లో రెండు రకాల చంద్రబాబుల్ని ప్రేక్షకులు చూడబోతున్నారు. 

మహానాయకుడు సినిమాలో చంద్రబాబు పాత్రను రానా పోషిస్తే.. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో శ్రీతేజ్ అనే వ‌ర్ధ‌మాన నటుడు చంద్రబాబు పాత్ర పోషించాడు.