చార్మి సెంటిమెంట్ ఫలిస్తుందా?

Charmee's A sentiment
Tuesday, July 16, 2019 - 20:15

"ఇస్మార్ట్ శంకర్" పై చాలా ఆశలు పెట్టుకుంది చార్మి. ఆమె ఈ సినిమాకు నిర్మాత కావడం ఒకెత్తయితే.. ఈమధ్య కాలంలో చార్మి చేసిన పెద్ద సినిమా ఇదే కావడం మరో ఎత్తు. అందుకే సినిమా ప్రమోషన్ కు సంబంధించిన ఏ చిన్న అంశాన్ని ఆమె విడిచిపెట్టడం లేదు. చివరికి సెన్సార్ సర్టిఫికేట్ ను కూడా. 

అవును.. క్లీన్-U వస్తే గొప్పగా చెప్పుకుంటారు ఎవరైనా. A-సర్టిఫికేట్ వస్తే కామ్ గా ఉంటారు. రచ్చ జరిగితే సర్దిచెప్పే ప్రయత్నం చేస్తారు. కానీ చార్మి మాత్రం A-సర్టిఫికేట్ కు కూడా చాలా హడావుడి చేస్తోంది. పైగా దీనికి సెంటిమెంట్ అద్దే ప్రయత్నం కూడా చేస్తోంది. 

ఇస్మార్ట్ శంకర్ సినిమాకు ఎ-సర్టిఫికేట్ వచ్చిన వెంటనే రియాక్ట్ అయింది చార్మి. పోకిరి, బిజినెస్ మేన్, దేశముదురు సినిమాలకు A-సర్టిఫికేట్ వచ్చిందని, కాబట్టి ఇస్మార్ట్ కూడా థియేటర్లలో దుమ్ముదులిపేస్తుందని, సూపర్ హిట్ అయిపోతుందనే అర్థం వచ్చేలా ట్వీట్ చేసింది. 

చార్మి తీసిన లాజిక్ అయితే బాగానే ఉంది కానీ, ఆ సెంటిమెంట్ ఏ మేరకు వర్కవుట్ అవుతుందనేది వేచి చూడాలి. నిజానికి పూరి సినిమాలకు ఎ-సర్టిఫికేట్ కొత్తకాదు. అతడి సినిమాలకు క్లీన్-యు సర్టిఫికేట్ వస్తే ఆశ్చర్యపడాలి. ఈ విషయం తెలిసి కూడా చార్మి సరికొత్త లాజిక్ ను తెరపైకి తీసుకొచ్చింది.