పలాస‌లో మెగాస్టార్ 2.0

Chiranjeevi in Palasa
Wednesday, July 24, 2019 - 08:45

ప్రజారాజ్యం స్థాపించిన టైమ్ లో శ్రీకాకుళం జిల్లాలో ఎన్నికల ప్రచారం చేశారు చిరంజీవి. ఆ తర్వాత మళ్లీ శ్రీకాకుళం గడ్డపై చిరంజీవి అడుగుపెట్టిన దాఖలాలు లేవు. మళ్లీ ఇన్నేళ్లకు ఆంధ్రప్రదేశ్ చిట్టచివరి జిల్లాగా ఉన్న శ్రీకాకుళంలో అడుగుపెట్టబోతున్నారు మెగాస్టార్. అది కూడా సినిమా షూటింగ్ కోసం కావడం విశేషం.

త్వరలోనే కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు చిరంజీవి. దీనికోసం ఆయన ప్రత్యేకంగా మేకోవర్ కూడా అయ్యారు. కాస్త బరువు తగ్గి ఫిట్ గా తయారయ్యారు. అంటే కొత్త చిరు అన్న‌మాట‌. మెగాస్టార్ 2.0ని చూడ‌బోతున్నాం.

ఆగస్ట్ లో ప్రారంభంకాబోతున్న ఈ సినిమా సెప్టెంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్తుంది. సినిమాలో ఓ రూరల్ బ్యాక్ డ్రాప్ ఎపిసోడ్ కూడా ఉంది. ఆ సన్నివేశాల్ని శ్రీకాకుళం జిల్లా పలాస వద్ద తీయాలని నిర్ణయించారు. అయితే ఈ షెడ్యూల్ ఎప్పుడనేది ఇంకా బయటకు రాలేదు.

మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్, కొణెదల ప్రొడక్షన్స్ కంపెనీలపై రాబోతోంది చిరంజీవి-కొరటాల సినిమా. సమాజానికి ఓ బలమైన సందేశాన్నిస్తూనే పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా రాబోతోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ రెండో వారంలో ఈ సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.