అలీ కోరిక కనీసం సగమైనా నెరవేరినట్టేనా!

Comedian Ali gets a post from YS Jagan
Monday, July 29, 2019 - 22:15

అసెంబ్లీలో అధ్యక్షా అనాలనేది అలీ కోరిక. అంతకంటే బల‌మైన కోరిక మంత్రి పదవిలో మెరిసిపోవాలనేది. ప్రస్తుతానికైతే ఈ రెండూ సాధ్యంకాలేదు. కానీ అధికార పార్టీ సభ్యుడు కాబట్టి అలీ కోరిక సగం నెరవేరినట్టే భావించాలి. అవును.. అలీకి ఇప్పుడొక నామినేటెడ్ పదవి లభించింది. ఐతే ఆ ప‌ద‌వి ఏంట‌నే విష‌యంలో రెండు ర‌కాల ప్రచారం జ‌రుగుతోంది. ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్ మెంట్ బోర్డ్ ప‌ద‌వి అనేది ఒక మాట‌. కాదు.. అత‌నికి వ‌క్ఫ్ బోర్డు చైర్మ‌న్‌గానో, మైనార్టీ శాఖ‌కి సంబంధించిన ప‌ద‌వో వ‌స్తుంద‌నేది టాక్‌.

ఇంత‌కీ అలీని వ‌రించ‌బోయే ఆ ప‌ద‌వి ఏంట‌నేది ఈ వారంలోనే తేల‌నుంది. 

ఎన్నికలకు ముందు అలీ చేసిన హంగామా అందరికీ గుర్తుండే ఉంటుంది. తనకు నచ్చిన చోట సీటిచ్చి, ఎమ్మెల్యే టిక్కెట్టు ఇచ్చిన పార్టీలోనే చేరతానని ఆయన ప్రకటించుకున్నారు. అక్కడితో ఆగకుండా మంత్రిపదవి కూడా రాసివ్వాలని డిమాండ్ చేశారు. అలా చాలా హంగామా చేసిన అలీ ఎలాంటి కండిషన్స్ పెట్టకుండానే జగన్ పార్టీలో చేరారు. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున ప్రచారం చేశారు. 

జగన్ కోరిక మేరకు ఎలాంటి డిమాండ్స్ పెట్టకుండా పార్టీలో చేరడంతో అలీకి ఇప్పుడు నామినేటెడ్ పదవి వరించింది. తనను నమ్ముకొని పార్టీలో చేరిన వాళ్లందరికీ ఇలా పదవులు కట్టబెడుతున్న ముఖ్యమంత్రి సీఎం జ‌గ‌న్‌.. తాజాగా 30 ఇయర్స్ పృధ్వికి శ్రీ వెంకటేశ్వర భక్తిఛానెల్ ఛైర్‌ప‌ర్స‌న్‌ పోస్ట్ ఇచ్చారు.  ఇప్పుడు మరో నటుడు అలీకి ప‌ద‌వి ఇస్తున్నారు. పోసానికి కూడా ఒక మంచి ప‌ద‌వి ఉంటుంద‌ట‌. ఐతే పోసాని ప్ర‌స్తుతం ఆరోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు.