బోర్డర్స్ దాటేసిన బుట్టబొమ్మ

Cricketer David Warner does Butta Bomma TikTok
Thursday, April 30, 2020 - 17:45

సంగీతానికి ఎల్లలు లేవంటారు. ఈ విషయాన్ని మరోసారి రుజువు చేసింది అల వైకుంఠపురములో సినిమాలోని బుట్టబొమ్మ సాంగ్. ఇప్పటికే ఆడియో పరంగా సూపర్ హిట్టయిన ఈ సినిమా, సినిమా రిలీజైన తర్వాత వీడియో పరంగా కూడా సూపర్ హిట్టయింది. అటు సోషల్ మీడియాలో కూడా ఈ పాటకు విపరీతంగా క్రేజ్ వచ్చింది. అంతా ఎవరికి వారు ఈ పాట స్టెప్పుల్ని సోషల్ మీడియాలో పెట్టి ఆనందపడ్డారు.

అలా ఈ సినిమా ఖండాంతరాలు కూడా దాటేసింది. ఇప్పటికే కొంతమంది పాకిస్థానీయులతో పాటు ఎంతోమంది విదేశీయులు ఈ పాటను పాడడం మనం చూశాం. వేలాది మంది ఔత్సాహికులు టిక్ టాక్ లో ఈ పాటకు డాన్సులు కూడా చేశారు. ఇప్పుడీ లిస్ట్ లోకి ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా చేరిపోయాడు.

తన భార్యతో కలిసి బుట్టబొమ్మ సాంగ్ సిగ్నేచర్ స్టెప్ వేశాడు వార్నర్. ఆ టిక్ టాక్ వీడియోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వార్నర్ సైతం తమ పాటకు డాన్స్ చేయడంతో అల వైకుంఠపురములో యూనిట్ మరోసారి సంబరపడింది.

నిజానికి ఈ సినిమా నుంచి పెద్ద హిట్టయిన పాట సామజవరగమన. సిద్ శ్రీరామ్ ఆలపించిన ఆ పాట, మూవీ రిలీజ్ కు ముందే పెద్ద హిట్ అయింది. సినిమా విడుదలైన తర్వాత బుట్టబొమ్మ సాంగ్ పెద్ద హిట్టవుతుందని, అదే టైమ్ లో తమన్ చెప్పాడు. అతడు చెప్పినట్టే, సామజవరగమన కంటే బుట్టబొమ్మ సాంగే ఇప్పుడు పెద్ద హిట్టయింది.