పళ్లు రాలతాయి, ఆ క్లారిటీ నాకుంది

Dil Raju's bold statement about hat-trick
Thursday, January 31, 2019 - 17:00

సినిమా రిజల్ట్ గురించైనా, కలెక్షన్లు గురించైనా ఉన్నది ఉన్నట్టు మాట్లాడ్డం దిల్ రాజు స్టయిల్. తన సినిమా ఫ్లాప్ అయినా "అవును.. ఫ్లాప్" అంటూ ఓపెన్ గా ప్రకటించడం దిల్ రాజుకే చెల్లింది. ఇలాంటి మైండ్ సెట్ ఉన్న దిల్ రాజు, మరోసారి తన గురించి తాను ఓపెన్ గా రియాక్ట్ అయ్యాడు. డబుల్ హ్యాట్రిక్ అంటూ అంతా ఊదరగొడుతున్నారని, కానీ పళ్లు రాలతాయనే విషయం తనకు తెలిసంటూ తనపై తానే సెటైర్ వేసుకున్నాడు.

"2017లో కూడా 6 హిట్స్ కొట్టాలని అనుకోలేదు. అప్పట్లో 3 సినిమాలు హిట్ అయిన తర్వాత, మరో 3 కొట్టాలని ఫిక్స్ అయ్యాం. అలా డబుల్ హ్యాట్రిక్ వచ్చింది. ఇప్పుడు కూడా 4-5 స్క్రిప్ట్ లపై క్లారిటీ ఉంది. ఆరో సినిమాపై క్లారిటీ వస్తుందా లేదో చెప్పలేను. ఎలాగోలా 6 సినిమాలు చేసేయాలని ట్రై చేస్తే పళ్లు రాలతాయి. ఆ క్లారిటీ నాకుంది. ముందు స్క్రిప్ట్ సెట్ కావాలి. ప్రస్తుతానికైతే 4-5 సినిమాల వరకు ఓకే. ఆరో స్క్రిప్ట్ వస్తుందో లేదో చూడాలి."

ఇలా తన డబుల్ హ్యాట్రిక్ ఫీట్ పై ఉన్నది ఉన్నట్టుగా స్పందించాడు దిల్ రాజు. మరోవైపు మహర్షి సినిమా విడుదలపై కూడా అంతే స్ట్రయిట్ గా రియాక్ట్ అయ్యాడు. అవును.. ఆ సినిమా లేట్ అవుతోందంటూ కుండబద్దలు కొట్టాడు.

"మహర్షి లేట్ అవ్వడానికి కారణం వీసాల మంజూరులో జాప్యమే. యూఎస్ వీసాలు నెల రోజులు లేటుగా వచ్చాయి. దాంతో మా షెడ్యూల్స్ అన్నీ మారిపోయాయి. మార్చిలో షూట్ కంప్లీట్ చేసి, ఏప్రిల్ 25న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాం. లాస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లోనే ఉంటుంది."