హీరోనవుతానని బెదిరిస్తున్న దర్శకుడు

Director Ajay Bhupathi to turn hero?
Wednesday, September 11, 2019 - 17:00

తమిళ దర్శకులందరికీ తెరపై కనిపించాలనే యావ ఉంటుందట.. ఆనాటి భారతీరాజా నుంచి నేటి ఎస్‌.జే.సూర్య వరకు నటులుగా మారిన తమిళ దర్శకుల సంఖ్య లెక్కపెట్టి చెప్పలేం. తెలుగులోనూ ఆ ట్రెండ్‌ ఉంది కానీ రేషియో చాలా తక్కువ. ఇపుడు యువ దర్శకుడు అజయ్‌ భూపతికి హీరోలపై కోపం వచ్చింది. ఆ కోపంలో తమిళ దర్శకుల వేలో వెల్దామనుకుంటున్నాడు. 

"ఆర్‌ఎక్స్‌100" వంటి సంచలన హిట్‌ సినిమా తీస్తే... నాకు డేట్స్ ఇవ్వకుండా తిప్పించుకుంటారా? వాట్‌ ది హెక్‌ అంటూ ఇక హీరో వేషం వేద్దామనుకుంటున్నాడట. బెల్లంకొండ శ్రీనివాస్‌, రామ్‌, నాగ చైతన్య, రవితేజ... ఇలా పలువురు హీరోల ఇళ్లకి రౌండ్స్‌ వేశాడు. ప్రతి హీరోతో సినిమా సెట్‌ అయిపోయిందనుకున్నాడు కానీ ఎవరూ డేట్స్‌ ఇవ్వలేదు. అంతా ఓకే అనుకొని లొకేషన్లు కూడా ఫిక్స్‌ చేసుకున్న తర్వాత రవితేజ హ్యండ్‌ ఇవ్వడంతో ఈ దర్శకుడికి చిర్రెత్తుకొచ్చింది. బీపీ పెరిగి ట్విట్టర్‌లో చీప్‌స్టార్‌ అంటూ రవితేజని టార్గెట్‌ చేస్తూ ట్వీట్‌ చేశాడట. ఇక ఇపుడు ఏకంగా తనే హీరో అవుతానంటూ బెదిరిస్తున్నాడు. 

ఏ హీరో కూడా నెల రోజల్లో డేట్స్‌ ఇవ్వకపోతే నేనే నటించి సినిమాని రిలీజ్‌ చేస్తానని బెదిరింపు మాటలు వదులుతున్నాడు. ఆరడగుల ఈ భీమవరం బుల్లోడు హీరోగా మారుతాడా లేక తెరవెనుకే ఉంటాడా అనేది మరో రెణ్ణాళ్లు ఆగితే తేలుతుంది.