బన్నీతో సినిమా... త్వరలోనే చెబుతా!

Director Maruth talks about his next movie
Friday, April 24, 2020 - 17:15

దర్శకుడు మారుతి, బన్నీ బెస్ట్ ఫ్రెండ్స్ అనే విషయం అందరికీ తెలిసిందే. కానీ బన్నీతో ఇప్పటివరకు సినిమా చేయలేకపోయాడు మారుతి. అయితే త్వరలోనే ఆ మేటర్ పై ఓ క్లారిటీ
ఇస్తానంటున్నాడు. లాక్ డౌన్ టైమ్ లో ఇంట్లోనే ఉంటూ మారుతి ఏం చేస్తున్నాడో చూద్దాం.

1. క్వారంటైన్ లో ఎలా గడపుతున్నారు?
నాకు ఎక్కడున్నా పేపర్-పెన్ను ఉంటే చాలు. ప్రతిరోజూ పండగే లాంటి హిట్ తర్వాత మరో మంచి కథ రాసుకోవడానికి, ఫ్యామిలీతో గడపడానికి ఈ లాక్ డౌన్ టైమ్ బాగా పనికొచ్చింది. ఈ లాక్ డౌన్ టైమ్ లో "స్పెషల్ ఓపీఎస్" వెబ్ సిరీస్ చూశాను. నాకు బాగా నచ్చింది. "ఫ్యామిలీ మేన్" చూశాను. ఇదొక కొత్త ఎక్స్ పీరియన్స్.

2. మహానుభావుడు మరోసారి వైరల్ అయింది.. ఎలా ఉంది?
కరోనా టైమ్ లో నేను తీసిన "మహానుభావుడు" సినిమా విజువల్స్ వైరల్ అవ్వడం ఆనందంగా ఉంది. ఓసీడీ వ్యక్తుల్ని నేను చూశాను. కొంత ఫన్ సైడ్ కూడా చూశాను. అందుకే ఆ సినిమా తీశాను. ఇలా కరోనా వచ్చి, ప్రతి ఒక్కరు వ్యక్తిగత శుభ్రతను కచ్చితంగా ఫాలో అయ్యే రోజు వస్తుందని మాత్రం ఊహించలేదు. కరోనాకు నా "మహానుభావుడు" సినిమా టీజర్ గా ఉపయోగపడింది.

3.లాక్ డౌన్ లో ఏదో రికార్డ్ సృష్టించారట?
ఈ లాక్ డౌన్ వల్ల నేనో రికార్డు సృష్టించాను. చిన్నప్పుడు ఏడో తరగతి పరీక్షల తర్వాత చాన్నాళ్లు ఇంట్లో ఉన్నాను. మళ్లీ ఇన్నేళ్లకు ఈ కరోనా వల్ల ఇన్ని రోజులు ఇంట్లో ఉన్నాను. మామూలుగా నేను ఆదివారం కూడా ఆఫీస్ కు వెళ్లిపోతాను. అలాంటిది ఇన్ని రోజులు ఇంట్లో ఉండడం రికార్డ్.

4. హీరోను దృష్టిలో పెట్టుకొని కథ రాస్తారా?
ఒక హీరోకే ఫిక్స్ అయి కథ రాయను. నేను రాసుకున్న కథ కనీసం ముగ్గురు, నలుగురు హీరోలకు సెట్ అయ్యేలా రాసుకుంటాడు. ఒక హీరో కోసం అని కథ రాసుకున్న తర్వాత ఆ హీరో దొరక్కపోతే, అలా వెయిట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ముందు సబ్జెక్ట్ అనుకొని.. మీడియం రేంజ్ హీరోలందరికీ సెట్ అయ్యేలా రాసుకుంటాను. ఏ హీరో దగ్గరకి కథ చెప్పడానికి వెళ్తున్నానో, ఆ హీరోకు తగ్గట్టు చిన్న చిన్న మార్పులు చేస్తుంటాను.

5. బన్నీతో సినిమా ఎప్పుడు?
బన్నీ-నేను మంచి ఫ్రెండ్స్. రోజూ వాట్సాప్ లో టచ్ లో ఉంటాం. నాకు ఏవేవో జోకులు పంపిస్తుంటాడు. నేను కూడా కొన్ని షేర్ చేస్తుంటాను. కాకపోతే ఫ్రెండ్ షిప్ వేరు, ప్రొఫెషన్ వేరు. తనతో ఎలాంటి సినిమా చేయాలనేది క్లారిటీ ఉంది. మంచి సబ్జెక్ట్ కోసం వెయిటింగ్. త్వరలోనే బన్నీ సినిమా గురించి చెబుతా.

6. భలే భలే మగాడివోయ్ కు సీక్వెల్ ఎప్పుడు?
"భలే భలే మగాడివోయ్", "మహానుభావుడు" సినిమాలకు సీక్వెల్స్ తీసే ఆలోచన లేదు. కాకపోతే ఈ రెండు సినిమాల్లోని క్యారెక్టర్లను మిక్స్ చేసి ఓ సినిమా చేయాలనే ఆలోచన ఉంది. ఎలా చేయొచ్చనేది ఓ ఐడియా ఉంది.  ఇంకా మా టీమ్ తో మాట్లాడలేదు. మాట్లాడి ఓ నిర్ణయం తీసుకోవాలి. కానీ దీనికంటే ముందు నా దగ్గర ఇంకా మంచి మంచి కథలున్నాయి. వాటిపై వర్క్ చేయాలనుకుంటున్నాను.