డిస్కో రాజా ఏంటి ఈ ఊగిస‌లాట‌

Disco Raja's confusion
Friday, May 3, 2019 - 13:45

"డిస్కోరాజా" పేరుతో చాలా నెల‌ల క్రిత‌మే రవితేజ ఒక సినిమాని లాంచ్ చేశాడు. "ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా" వంటి చిత్రాలు తీసిన విఐ ఆనంద్ డైర‌క్ష‌న్‌లో ఈ సినిమా మొద‌లైంది. మొద‌లైన మాట వాస్త‌వ‌మే కానీ ఆ త‌ర్వాత ముందుకు ప‌డ‌డం లేదు. ర‌వితేజ ఇంత‌వ‌ర‌కు ఈ సినిమా సెట్లో అడుగుపెట్ట‌లేదు.

న‌భా నటేష్‌, పాయ‌ల్ రాజ్‌పుత్ అనే ఇద్ద‌రు భామ‌ల‌ను మాత్రం సైన్ చేశారు. మూడో భామ కూడా ఉంటుంది ఈ మూవీలో.

తాజాగా డెక్క‌న్ క్రానిక‌ల్ అనే ఆంగ్ల పత్రిక ఈ సినిమా ఆగిపోయింద‌ని ఒక న్యూస్‌ని ప్ర‌చురించింది. ఈ మూవీ క‌థ‌కి, స‌మంత న‌టిస్తున్న "ఓ బేబీ క‌థ‌"కి పోలీక‌లున్నాయ‌ట‌. అలాగే ఈ సినిమా నిర్మాత ఎన్నిక‌ల ఫలితాల కోసం వేచి చూస్తున్నాడు. ఈ కార‌ణాల వ‌ల్ల ఈ సినిమా అడుగులు ముందుకు ప‌డ‌డం లేదు. ఐతే "డిస్కోరాజా" సినిమా మాత్రం ఉంటుంద‌నీ, అట‌కెక్క‌లేద‌నీ సినిమా టీమ్ అంటోంది.

ర‌వితేజ గ‌తేడాది హ్య‌ట్రిక్ ఫ్లాప్‌లు ఇచ్చాడు. "ట‌చ్ చేసి చూడు", "నేల టికెట్‌", "అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ"....ఇవీ ఆ మూడు ఫ్లాప్‌లు. నేల టికెట్ నిర్మించిన రామ్ తాళ్లూరి ఈ "డిస్కోరాజా"కి కూడా నిర్మాత‌. "నేల టికెట్" పోయినందుకు ప‌రిహారంగా ర‌వితేజ ఈ సినిమా ఇచ్చాడు స‌ద‌రు నిర్మాత‌కి. ఐతే ఆ నిర్మాత ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌న‌సేన‌కి ధ‌న‌స‌హాయం చేశాడు. ఎన్నిక‌ల ఫలితాలు వ‌చ్చిన త‌ర్వాత ఆయ‌న కాస్త ఫ్రీ అవుతాడు. అంటే జూన్‌లో "డిస్కోరాజా" సెట్‌లో డిస్కో చేస్తాడా లేక ఏకంగా ప‌క్క‌న పెడుతాడా అనేది తేలుతుంది.