ఆ రూమర్ నిజ‌మైతే బాగుండు!

Eesha Rebba responds on rumors about Rajamouli's film
Thursday, December 6, 2018 - 18:30

పుకార్ల‌ను ఇష్ట‌ప‌డ‌రు సినిమా తార‌లు. పుకార్ల‌ను ప్ర‌స్తావిస్తే జ‌ర్న‌లిస్ట్‌ల‌పై మండిప‌డుతారు. కానీ ఇషా రెబ్బా మాత్రం ఆ రూమ‌ర్ నిజమైతే బాగుండు అని అంటోంది. ఆమె నటించిన తాజా చిత్రం..సుబ్ర‌మ‌ణ్యం పురం రేపు (డిసెంబ‌ర్ 7) విడుద‌ల కానుంది. ఈ సినిమా రిలీజ్ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడింది..

సుబ్రహ్మణ్యపురం నాకు చాలా ప్రత్యేకం

దర్శకుడు సంతోష్ రెండు గంటలు పాటు కథ చెప్పాడు. అతను కథ చెపుతున్నప్పుడు నేను విజువలైజ్ చేసుకున్నాను అది నాకు బాగా నచ్చింది. అందుకే ఓకే చెప్పాను. సస్పెన్స్ థ్రిల్లర్స్ అంటే నాకు చాలా ఇష్టం. అన్ని రకాల సినిమాలు చూస్తాను. కానీ నెక్ట్స్ ఏమవుతుంది అని టెన్సన్ పడుతూ సినిమాలు చూడటం నాకు ఇష్టం. ఆ ఎలిమెంట్స్ సుబ్రహ్యణ్యపురం లో చాలా ఉన్నాయి.  

సుమంత్ అంటే ఇష్టం

నేను భక్తురాలుగా కనిపిస్తాను ఈ సినిమాలో సుమంత్ కంప్లీట్ అపోజిట్ రోల్ ప్లే చేశాడు. వారి అభిప్రాయాల మద్య ఘర్షణ ఉంటుంది.  దేవుడు ఉన్నాడని నమ్మే అమ్మాయికి , దేవుడు పై రిసెర్చ్ చేసే అబ్బాయికి మధ్య‌ లవ్ ఫీల్ ఎలా కలిగింది అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. సుమంత్ సినిమాలలో గోదావరి, గోల్కొండ హైస్కూల్,  మళ్లీరావా సినిమాలు నాకు ఇష్టం. ఆయన నటన సహజంగా ఉంటుంది. అది నాకు నచ్చుతుంది. 

పని అడిగితే తప్పేంటి

నాకు వచ్చిన కథలలో నాకు నచ్చినవి ఎంచుకుంటున్నాను. ఒక పాత్రకు నేను ఉంటే బాగుంటుంది అనుకునే పాత్రలను చేస్తున్నాను. నాకు కొత్త దర్శకులతో, కొత్త కాంబినేషన్స్ లో వర్క్ చేయాలని ఉంటుంది. నేను అలాంటి పాత్రలు కోసం అప్రోచ్ అవుతాను, పని అడగటంలో తప్పు లేదు కదా. తెలుగు అమ్మాయిలకు అవకాశాలు  ఇప్పుడు పెరుగుతున్నాయి. 

ఆ పుకారు నిజం కావాలి

యన్‌టిఆర్ బ‌యోపిక్‌లో నేను న‌టిస్తున్నానా అనేది నేను ఇప్పుడే ఏమీ చెప్పలేను. ఇక ఎస్‌.ఎస్‌ రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ చిత్రంలోనూ నాకు అవకాశం దక్కిందని ప్ర‌చారం జ‌రుగుతోంది ఒకవేళ అదే నిజమైతే నా అంత సంతోషించేవారు మరొకరుండరు. ఈ పుకారు నిజం కావాల‌ని కోరుకుంటున్నా.

పెద్ద సినిమాలో చిన్న పాత్ర‌

‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రంలో ఎందుకు న‌టించావ‌ని అడుగుతున్నారు. అవును.. నా పాత్ర‌కి పెద్ద‌గా ప్రాధాన్యం లేదు. కాక‌పోతే త్రివిక్ర‌మ్ డైర‌క్ష‌న్లో న‌టించాల‌న్న డ్రీమ్‌, ఎన్టీఆర్‌తో యాక్ట్ చేయాల‌న్న అభిలాష..రెండూ నెర‌వేరాయి క‌దా. పెద్ద సినిమాలో చిన్న పాత్ర అయినా అంద‌రూ మాట్లాడుకునేలా చేస్తుంది.