నిర్మాత నారా జ‌య‌శ్రీ క‌న్నుమూత‌

Film producer Nara Jayashree Devi passes away
Wednesday, February 13, 2019 - 16:15

"శ్రీమంజునాథ" వంటి సినిమాల‌ను నిర్మించిన ప్ర‌ముఖ నిర్మాత నారా జయశ్రీ దేవి కన్నుమూశారు. హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆమె వయస్సు 58 సంవత్సరాలు. భర్త, కుమార్తె ఉన్నారు.

క‌న్న‌డంలో ప‌లు విజ‌య‌వంత‌మైన సినిమాలు తీశారు. తెలుగు వారైన నారా జ‌య‌శ్రీ క‌న్న‌డ‌నాట స్థిర‌ప‌డ్డారు. తెలుగులో "శ్రీమంజునాథ‌"తో పాటు "చంద్ర‌వంశం" సినిమాని కూడా నిర్మించారు. ర‌చ‌యిత జేకే భార‌వి కెరియ‌ర్‌ని నిల‌బెట్టిన నిర్మాత ఆవిడ‌. భార‌వి ద‌ర్శ‌క‌త్వంలోనూ ఒక సినిమా నిర్మించారు.

జయశ్రీదేవి తొలుత పాత్రికేయురాలిగా కెరీర్‌ ప్రారంభించారు. ఆ తర్వాత సినిమాల పట్ల ఆసక్తితో నిర్మాణవ్యవహారాలు చూసేవారు. కన్నడ పరిశ్రమలో దాదాపు 25 చిత్రాలు నిర్మించారు. తెలుగులో చిరంజీవితో 'మంజునాథ', కృష్ణతో 'చంద్రవంశం', 'ఆదిశంకరాచార్య' చిత్రాలు నిర్మించారు. కన్నడలో 'నిశ్శబ్ద', 'నమ్ముర మందార హువే', 'హబ్బా', 'అమృతవర్షిణి', 'ముకుందా మురారి' వంటి చిత్రాలు రూపొందించారు. తాజాగా 'కురుక్షేత్ర' సినిమా నిర్మాణం చేస్తున్నారు. జయశ్రీదేవి అంత్యక్రియలు బెంగళూరులో జరుగుతాయి.

జయశ్రీ మృతి పట్ల కన్నడ, తెలుగు చిత్ర పరిశ్రమలకు చెందిన ప్రముఖులు సంతాపం తెలిపారు.