నిర్మాత‌ల‌తో రాజీకొచ్చిన గోపిసుంద‌ర్‌

Gopi Sundar is giving tough time to producers?
Thursday, April 18, 2019 - 17:30

"మ‌జిలీ" సినిమా రిలీజైంది. హిట్ట‌యింది. సినిమాలోని రెండు పాట‌లు కూడా బాగా క్లిక్ అయ్యాయి. ఐతే నిర్మాత‌లు మాత్రం ఈ సినిమా సంగీత ద‌ర్శ‌కుడిపై ఇప్ప‌టికీ గుర్రుగా ఉన్నారు. "మ‌జిలీ" సంగీత ద‌ర్శ‌కుడు గోపిసుంద‌ర్.. రిలీజ్‌కి ముందు నిర్మాత‌ల‌కి చుక్క‌లు చూపించాడు. 

గోపిసుంద‌ర్ అద్భుత‌మైన ట్యూన్లు ఇస్తాడు. కానీ నేప‌థ్య సంగీతం విష‌యానికొచ్చేస‌రికి బ‌ద్ద‌కిస్తాడు. టైమ్ స‌రిపోదు అంటాడు. గ‌తంలో ప‌లు సినిమాల విష‌యంలో అలాగే చేశాడు. తాజాగా "మ‌జిలీ" సినిమాకి అదే ప‌ని చేశాడు. గోపిసుంద‌ర్ ఇచ్చేంత వ‌ర‌కు ఆగితే పుణ్య‌కాలం కాస్త గ‌డిచిపోతుంద‌ని భ‌య‌ప‌డ్డ మ‌జిలీ నిర్మాత‌లు అర్జెంట్‌గా త‌మ‌న్‌తో మాట్లాడి అత‌నితో బ్యాగ్రౌండ్ స్కోర్ చేయించుకున్నారు. త‌మ‌న్ నేప‌థ్య సంగీతానికి మంచి పేరు వ‌చ్చింది.

సినిమా హిట్ కావ‌డంతో.. నిర్మాత‌లు ఇపుడు ఊపిరి పీల్చుకున్నారు. ఐతే గోపిసుంద‌ర్‌ని అలా క్ష‌మించేసి వ‌దిలెయ్యొద్ద‌ని ఫిక్స్ అయ్యారు ఆ నిర్మాత‌లు. అత‌నిపై చాంబ‌ర్లో కేసు వేసేందుకు రెడీ అయ్యారు. ఐతే విష‌యం తెలిసిన గోపిసుంద‌ర్‌.. నిర్మాత‌ల‌తో రాజీకొచ్చాడ‌ట‌. ఇంత‌కీ ఆ రాజీఫార్మూలా ఏంటో!