జేమ్స్ గోవిందావ‌తారం!

Govinda was to do Avatar?
Tuesday, July 30, 2019 - 15:30

జేమ్స్ కేమరూన్ అద్భుత సృష్టి అవతార్. విజువల్ గ్రాఫిక్ వండర్ గా ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్ అయింది ఈ సినిమా. ఈ మూవీ కలెక్షన్లు అందుకోవడం మరో సినిమా తరం కాలేదు. రీసెంట్ గా వచ్చిన ఎవెంజర్స్ - ఎండ్ గేమ్ అనే సినిమా అతికష్టంమీద అవతార్ రికార్డును బద్దలుకొట్టగలిగింది. 

అలా ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్ అయిన అవతార్ సినిమాకు తనే టైటిల్ సజెస్ట్ చేశానని అంటున్నాడు బాలీవుడ్ సీనియర్ నటుడు గోవింద. ఆ సినిమాలో ఓ పాత్ర పోషించే అవకాశం తనకు వచ్చిందని, కానీ తనకు కథ నచ్చక ఒప్పుకోలేదన్నాడు. అయితే కెమరూన్ లాంటి పెద్దమనిషి వచ్చి అడిగాడు కాబట్టి, బాగుండదు కాబట్టి అవతార్ టైటిల్ పెట్టుకోమని ఓ ఉచిత సలహా ఇచ్చినట్టు చెప్పుకున్నాడు. 

అంతేకాదు.. ఈ సినిమా తీయడానికి ఏడేళ్లు పడుతుందని కెమరూన్ కు అప్పుడే చెప్పానని, దానికి అతడు తనపై కోపగించుకున్నాడని గోవింద అన్నాడు. తర్వాత అదే నిజమైందని చెప్పుకొచ్చాడు. 410 రోజుల డేట్స్ అడగడం వల్లనే తను అవతార్ నుంచి తప్పుకున్నానని గోవింద అన్నాడు.

గోవింద వ్యాఖ్యలతో నెటిజన్లు భగ్గుమన్నారు. అవతార్ గెటప్ లో గోవిందను మార్ఫింగ్ చేసి ట్రోల్ చేస్తున్నారు. గోవిందను ఇలానే వదిలేస్తే, ఐరన్ మ్యాన్ ఆఫర్ కూడా తనకే వచ్చిందని గోవింద చెబుతాడంటూ జోకులు పేలుస్తున్నారు. తన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో ఇలా మరోసారి బుక్ అయ్యాడు గోవింద.