హ‌రికృష్ణ‌....చైత‌న్య ర‌థ‌సార‌థి

Harikrishna, the driving force of Chaitanya Ratham
Wednesday, August 29, 2018 - 10:30

స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క‌రామారావు కుమారుడిగా హ‌రికృష్ణ తెలుగు దేశం పార్టీ నేత‌ల‌కి అత్యంత ప్రియ‌మైన వ్య‌క్తి. పాత త‌రం రాజ‌కీయ నాయ‌కులు.. ఆయన్ని చైత‌న్య ర‌థ‌సార‌థిగా అభిమానిస్తారు. సినిమా ప‌రిశ్ర‌మ వ‌దిలి రాజ‌కీయాల్లోకి అడుగుపెట్టిన త‌ర్వాత ఎన్టీఆర్ ..ఆంధ్ర‌ప్ర‌దేశ్ అంతా ప‌ర్య‌టించారు. తెలుగుదేశం పార్టీ  ప్రచారం కోసం షెవర్లెట్ వాహనాన్ని మాడిఫై చేసి, దానికి చైత‌న్య ర‌థం అనే పేరు పెట్టారు ఎన్టీ రామారావు. ఆ బ‌స్సు స్టీరింగ్‌ని చేప‌ట్టింది ఎవ‌రో కాదు ఆయ‌న కుమారుడు నంద‌మూరి హ‌రికృష్ణ‌నే.

ఎన్టీఆర్ ప‌ర్య‌ట‌న ఆసాంతం హ‌రికృష్ణ చైత‌న్య ర‌థాన్ని న‌డిపారు. అప్ప‌టి నుంచి హరికృష్ణ రథసారధిగానే గుర్తుండిపోయారు తెలుగుదేశం పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కి. తెలుగుదేశం పార్టీని నిల‌బెట్టిన నాయ‌కుల్లో ఒక‌రిగా హ‌రికృష్ణ‌కి గుర్తింపు ఉంది. 

అలాంటి హ‌రికృష్ణ‌..ఆగ‌స్ట్ సంక్షోభంలో తండ్రికి వ్య‌తిరేకంగా నిల‌బ‌డ‌డం కూడా ఒక విషాద‌మే. ఐతే కుటుంబం అంతా అపుడు చంద్ర‌బాబువైపు నిల‌వ‌డంతో ఆయ‌న కూడా అటే నిలిచారు. ఆ త‌ర్వాత బాబు మంత్రివ‌ర్గంలో రవాణా మంత్రిగా పనిచేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌మైక్యంగా ఉండాల‌ని కోరుకున్నారు హ‌రికృష్ణ‌.

రాజ‌కీయ జీవితంలో హ‌రికృష్ణ పెద్ద విజ‌యాలేమీ సాధించ‌లేదు కానీ నంద‌మూరి అభిమానుల్లో, తెలుగు దేశం పార్టీ కార్య‌క‌ర్త‌ల గుండెల్లో చెర‌గ‌ని స్థానాన్ని సంపాదించుకున్నారు.