ఈ నెల‌లో వంద‌ల కోట్లు బెట్టింగ్‌!

Hundreds of crores of rupees at stake on Nov 2018 releases
Sunday, November 4, 2018 - 10:30

న‌వంబ‌ర్ నెల‌లో స‌వ్య‌సాచి ఇప్ప‌టికే వ‌చ్చింది. దాని ఫ‌లితం చూశాం. దీపావ‌ళి నుంచి వ‌రుస‌గా సినిమాలు క్యూ క‌డుతున్నాయి. వంద‌ల కోట్ల రూపాయ‌లు వ్యాపారం జ‌ర‌గ‌నుంది ఈ నెల‌.

సాధార‌ణంగా న‌వంబ‌ర్‌లో సినిమాల తాకిడి త‌క్కువ ఉంటుంది. ఎందుకంటే ఇది డ‌ల్ సీజ‌న్ కాబ‌ట్టి. కానీ ఈ సారి ప‌రిస్థితి భిన్నంగా ఉంది. వంద‌ల‌ కోట్ల రూపాయ‌ల‌తో తీసిన సినిమాలు కూడా ఈ నెల‌లోనే వ‌స్తున్నాయి. దేశ‌వ్యాప్తంగా హిందీ, తెలుగు, త‌మిళ భాష‌ల్లో భారీ ఎత్తున విడుద‌ల కానుంది అమీర్ ఖాన్ న‌టించిన థ‌గ్స్ ఆఫ్ హిందోస్తాన్‌. ఈ సినిమాని తెలుగునాట కూడా భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు న‌వంబ‌ర్ 8న‌. 

ఇక న‌వంబ‌ర్ 6న విడుద‌ల కానుంది విజ‌య్ న‌టించిన‌..స‌ర్కార్‌. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ వీక్‌గా ఉన్నాయి. కానీ సినిమాపై అంచ‌నాలు ఉన్నాయి. న‌వంబ‌ర్ 7న పందిపిల్ల క‌థానాయిక‌గా తీసిన అదుగో రానుంది. దీనిపై ఎవరికీ ఏ అంచ‌నాలు లేవు. ఆడితే..ర‌విబాబు ల‌క్‌. అంతే. 

న‌వంబ‌ర్ 15, 16, 17 తేదీల్లో వ‌రుస‌గా సినిమాలు వ‌స్తున్నాయి. 15న శ‌ర‌భ అనే ఒక అప్‌క‌మింగ్ హీరో మూవీ, 16న ర‌వితేజ న‌టించిన అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ రిలీజ్ కానున్నాయి. అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని ..ర‌వితేజ‌కి కీల‌కం. ఈ సినిమా ఆడితేనే ఆ త‌ర్వాత ర‌వితేజ సినిమాల‌ను ఎవ‌రైనా కొంటారు. ఈ ఏడాది ఇప్ప‌టికే ఇద్ద‌రు నిర్మాత‌ల‌కి ర‌వితేజ బ్యాండ్ వేశాడు అట్ట‌ర్‌ఫ్లాప్‌ల‌తో. ఇక ద‌ర్శ‌కుడు శ్రీనువైట్ల భ‌విత‌వ్యాన్ని నిర్ణ‌యించేంది కూడా ఇదే. గోవా సుంద‌రి ఇలియానా ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తోంది టాలీవుడ్‌లో. ఆమెకి మ‌ళ్లీ తెలుగులో డిమాండ్ ఉంటుందా అనేది డిసైడ్ చేసే మూవీ కూడా అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని. 

ఆ త‌ర్వాత రోజు రానుంది.. టాలీవుడ్ రైజింగ్ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన ట్యాక్సీవాలా. ఈ సినిమా ఒక థ్రిల్ల‌ర్‌. త‌క్కువ బ‌డ్జెట్‌తో తీసిన కాన్పెస్ట్ మూవీ. గ‌ట్టిగా ఓపెనింగ్స్ వ‌చ్చి..మొద‌టి వీకెండ్ ఆడినా కొన్న‌వాళ్లు లాభాల్లోకి వెళ్తారు. విజ‌య్ దేవ‌ర‌కొండ ఇప్ప‌టికే స్టార్‌గా నిల‌బ‌డ్డాడు. ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్ తీసుకొస్తే..ఆయ‌న స్టార్‌డ‌మ్‌కి వ్యాల్యూ ఉంటుంది. 

న‌వంబ‌ర్ 22న రాంగోపాల్ వ‌ర్మ క‌న్న‌డంలో నిర్మించిన భైర‌వ‌గీత తెలుగులోనూ డ‌బ్ అయి విడుద‌ల కానుంది. వ‌ర్మ సినిమాల‌పై అంచ‌నాలు ఏముంటాయి? మ‌రో రెండు ఏ అంచ‌నాలు లేని సినిమాలు కూడా అదే వీకెండ్ రానున్నాయి. అవి..హెబ్బా న‌టించిన 24 కిసెస్‌.మ‌రోటి సుబ్ర‌మ‌ణ్య‌పురం. 

నెలాఖ‌రున రానుంది ఇయ‌ర్ ఆఫ్ ది మూవీగా ప‌రిగ‌ణిస్తున్న‌... టూ పాయింట్ ఓ. సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌, శంక‌ర్ కాంబినేష‌న్‌లో 500 కోట్ల (అని టీమ్ ప్ర‌చారం చేసుకుంటోంది) రూపాయ‌ల‌తో తెర‌కెక్కిన భారీ మ‌ల్టీలింగ్వ‌ల్ మూవీ ఇది. ఈ సినిమాని తెలుగునాట ఎవ‌రూ కొన‌లేదు. ఎన్‌వీ ప్ర‌సాద్ ద్వారా రిలీజ్ చేస్తున్నారు. ట్ర‌యిల‌ర్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. గ్రాఫిక్స్ సూప‌ర్‌గా ఉన్నాయ‌నిపిస్తోంది. ఐతే చెపుతున్న బ‌డ్జెట్ రావాలంటే.. ఇది స‌రైన సీజ‌న్ కాద‌నేది ఒక వాద‌న‌. కానీ మంచి సినిమాకి గుడ్ సీజ‌న్‌, అన్ సీజ‌న్ అనేది ఉండ‌ద‌నేది మ‌రో వాద‌న‌. మ‌రి ర‌జనీకాంత్‌, శంక‌ర్‌..మ‌రోసారి అందరి అంచ‌నాల‌ను మించిన భారీ బ్లాక్‌బ‌స్ట‌ర్ ఇస్తారా అనేది చూడాలి.