తెరాస‌కే ప‌వ‌ర్‌స్టార్ సపోర్ట్‌!

Jana Sena to support TRS in Telangana elections
Monday, December 3, 2018 - 22:30

తెలంగాణ ఎన్నిక‌ల్లో అధికార తెలంగాణ రాష్ట్ర స‌మితికే జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌ద్ద‌తు తెల‌ప‌నున్నారు. ఈ మేర‌కు ఆయ‌న ఓ నిర్ణ‌యం తీసుకున్నార‌ని తెలుగుసినిమా.కామ్ ఇంత‌క‌ముందే వార్త‌ను ప్ర‌చురించింది. తాజాగా ఆయ‌న చేసిన ట్వీట్ సారాంశం అదే. 

తెలంగాణ‌కి షెడ్యూల్ క‌న్నా ముందే ఎన్నిక‌లు వ‌చ్చినందున ఈ సారి త‌మ పార్టీ పోటీ చేయ‌డం లేద‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇంత‌కుముందే ప్ర‌క‌టించాడు. ఇక తాజాగా ఆయ‌న త‌మ పార్టీ అభిమానులు, కార్య‌క‌ర్త‌ల నుంచి అభిప్రాయాన్ని సేక‌రిస్తున్నాడు. 

"తెలంగాణ ముందస్తు ఎన్నికల నేపధ్యం లో మిత్రులు, జనసైనికులు, ప్రజలతో పాటు పోటీ చేస్తున్న అభ్యర్థులు కూడా పార్టీ  అభిప్రాయాన్ని తెలియచెయ్యమని కోరుతున్నారు. జనసేన పార్టీ  అభిప్రాయాన్ని 5 వ తారీఖున తెలియపరుస్తామ,"ని జ‌న‌సేనాని ట్వీట్ చేశాడు. ఐతే ఐదో తేదీన ఆయ‌న చెప్పే అభిప్రాయం ఒక్క‌టే - తెలుగుదేశం పార్టీ,  కాంగ్రెస్ పార్టీల కూట‌మికి నో చెప్ప‌డ‌మే. తెరాస‌కే త‌మ మ‌ద్ద‌తు అని ప్ర‌క‌టించ‌డ‌మే.

గ‌త ఎన్నిక‌ల్లో ప‌వ‌ర్‌స్టార్ తెలుగుదేశం పార్టీ - బీజేపీ త‌ర‌ఫున తెలంగాణ‌లో ప్ర‌చారం చేశాడు. ఐతే ఇపుడు ఆ రెండు పార్టీల‌తో దూరంగా ఉంటున్నాడు. ఆంధ్రాలో తెలుగుదేశం పార్టీపై విమ‌ర్శ‌నాస్త్రాలు సంధిస్తున్నాడు. ఇక కాంగ్రెస్ ముక్త్ భార‌త్ అని గ‌త ఎన్నిక‌ల్లో ప్ర‌చారం చేసిన ప‌వ‌ర్‌స్టార్ కాంగ్రెస్ కూట‌మికి ఎలాగూ స‌పోర్ట్ ఇవ్వ‌లేడు. అందుకే తెరాస‌కే ఆయ‌న ఓటు.