ఆయ‌న్ని హింసించం: జీవిత రాజ‌శేఖ‌ర్‌

Jeevitha and Rajasekhar on YS Jagan's massive victory
Saturday, May 25, 2019 - 23:45

ఆంధ్ర‌ప్ర‌దేశ్ కాబోయే ముఖ్య‌మంత్రి వై ఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి సినిమా ఇండ‌స్ట్రీ నుంచి అభినంద‌నలు వెల్లువెత్తుతున్నాయి. జ‌గ‌న్ పార్టీకి చివిరి నిమిషంలో మ‌ద్ద‌తు ప‌లికిన సెల‌బ్రిటీల‌లో జీవిత‌, రాజ‌శేఖర్ ఉన్నారు. వారు ఇపుడు ఆనందంగా ఉన్నారు. 

"వైఎస్ జగన్ విజయంలో మేం భాగస్వాములు కావడం అదృష్టంగా భావిస్తున్నాం. నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి విజయంలోనూ మా పాత్ర ఉండటం ఆనందంగా ఉంది. జగన్ గెలుస్తాడని ముందే తెలుసు, " అని చెప్పారు జీవిత‌, రాజ‌శేఖ‌ర్‌. మ‌రి వీరు ఏదైనా ప‌దవి ఆశిస్తున్నారా? "వైకాపాలో మా పాత్ర ఎలా ఉంటుందో తెలియదు. మేం ఆయ‌న్ని ఇది కావాల‌ని హింసించం," అంటూ క్లారిఫికేష‌న్ ఇచ్చారు.

ఈ దంప‌తులిద్ద‌రూ ఇప్ప‌టికి అనేక పార్టీలు మారారు. ఐతే పార్టీలు మార‌డం త‌ప్పు కాద‌ని స‌మ‌ర్ధించుకుంటున్నారు. అంతేకాదు, ప‌వ‌న్ క‌ల్యాణ్ తాను పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోవ‌డం త‌మ‌ని బాధించింద‌ని చెపుతున్నారు. ఎక్క‌డో చోటా ఆయ‌న గెలిపించి ఉంటే బాగుండేది అని ప‌వ‌న్‌పై జాలి చూపారు.