జెర్సీ టీజర్: సూటిగా సుత్తిలేకుండా!

Jersey teaser is interesting
Saturday, January 12, 2019 - 16:30

సాధారణంగా ఏ సినిమా టీజర్ అయినా ఫాలో అయ్యే బేసిక్ సూత్రం ఒకటే. సినిమాపై కాస్త ఆసక్తి రేకెత్తించేలా, ఇంకాస్త సస్పెన్స్ మెయింటైన్ అయ్యేలా కట్ చేస్తారు. లేదంటే పూర్తిగా హీరో స్టార్ డమ్ మీద ఆధారపడి టీజర్స్ వస్తుంటాయి. కానీ వీటికి విభిన్నంగా వచ్చింది "జెర్సీ" టీజర్.

నాని హీరోగా నటిస్తున్న ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు. సూటిగా సుత్తిలేకుండా ఈ టీజర్ లోనే సినిమా కథ మొత్తం చెప్పేశారు. ఈ విషయంలో ఎలాంటి హైప్ ఇవ్వదలుచుకోలేదు. 36 ఏళ్ల అర్జున్, లేటు వయసులో క్రికెటర్ గా ఎలా సక్సెస్ అయ్యాడనేదే ఈ సినిమా కథ. కాకపోతే ఆ వయసులో అర్జున్ స్టార్ క్రికెటర్ గా ఎదగడానికి దోహదపడిన అంశాల్ని మాత్రం టీజర్ లో దాచేశారు. బహుశా..ఈ యాంగిల్ లోనే హీరోయిన్ శ్రద్ధ శ్రీనాధ్ ఎంట్రీ ఉంటుందేమో.

"అజ్ఞాతవాసి" తర్వాత అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్న సినిమా ఇదే. టీజర్ కు మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు అనిరుధ్. పనిలోపనిగా సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న "జెర్సీ" సినిమాను ఏప్రిల్ లో విడుదల చేయబోతున్నారు.