కాజల్ కు అరుదైన వ్యాధి

Kajal Aggarwal reveals she's autoimmune disorder
Wednesday, December 5, 2018 - 14:30

ఈ ఏడాది ప్రారంభంలో తను ఓ విచిత్రమైన వ్యాధితో బాధపడినట్టు కాజల్ ప్రకటించింది. ఆ వ్యాధి పేరు ఆటో ఇమ్యూన్ డిజార్డర్. మన శరీరంలో ఉన్న రోగ నిరోధక శక్తి మనకే ఎదురుతిరిగే అరుదైన వ్యాధి ఇది. సాధారణంగా మనకు రోగాలు రాకుండా ఈ రోగనిరోధక శక్తి కాపాడుతుంది. కానీ ఇదే శక్తి, మన శరీరంలో ఉన్న కణాలకు వ్యతిరేకంగా కొన్ని నెగెటివ్ కణాల్ని ఉత్పత్తి చేస్తుంది. అదే ఆటో ఇమ్యూన్ డిజార్డర్. 

ఈ వ్యాధితో ఈ ఏడాది ప్రారంభంలో ఏకంగా 3 నెలల పాటు మంచం కదల్లేదని తెలిపింది కాజల్. ఆ టైమ్ లో చాలా బాధపడ్డానని, ఒక దశలో సినిమాలు కూడా ఆపేద్దామని అనుకున్నానని తెలిపింది. కానీ ముంబయిలోని వైద్యుల పర్యవేక్షణలో ఆ వ్యాధి నుంచి 3 నెలల్లో కోలుకున్నానని ప్రకటించింది. 

ఏదేమైనా వచ్చే ఏడాది నుంచి తను సినిమాలు తగ్గిస్తానని ప్రకటించింది కాజల్. సినిమాల విషయంలో స్పీడ్ తగ్గించమని దేవుడే ఈ వ్యాధి ద్వారా తనకు చెప్పినట్టు అనిపించిందని, ఇకపై ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టి సినిమాలు తగ్గిస్తానని తెలిపింది.