న‌య‌న్‌కి చెక్ పెట్టిన క‌మ‌ల్‌

Kamal Haasan as Bigg Boss 3 Tamil host, not Nayanthara
Wednesday, May 15, 2019 - 22:00

క‌మ‌ల్‌హాస‌న్ స్థానంలో న‌య‌న‌తార రానుంద‌న్న వార్త‌ల‌కిక ఫుల్‌స్టాప్ ప‌డిన‌ట్లే. బిగ్‌బాస్ 3 త‌మిళ వెర్స‌న్‌కి హోస్ట్‌గా న‌య‌న‌తార‌ని ఎంపిక చేశార‌ని ఇటీవ‌ల వార్త‌లు జోరుగా వినిపించాయి. బిగ్‌బాస్ త‌మిళ వెర్స‌న్‌కి చెందిన మొద‌టి రెండు సీజ‌న్‌లు (సీజ‌న్ వ‌న్‌, సీజ‌న్ టూ) క‌మ‌ల్‌హాస‌న్ హోస్ట్‌గానే న‌డిచాయి, పాపుల‌ర్ అయ్యాయి. ఐతే ఆయ‌న రాజ‌కీయాల‌తో బిజీ కావ‌డం, త‌రుచుగా వివాదాల్లో ఇరుక్కుంటుండ‌డంతో క‌మ‌ల్ బ‌ద‌లు న‌య‌న్ అయితే బాగుంటుంద‌ని ఆ కార్య‌క్ర‌మ నిర్వ‌హ‌కాలు భావించారు. కానీ క‌మ‌ల్‌హాస‌న్ ఒప్పుకోలేదు.

క‌మ‌ల్‌కి ఇపుడు ప్ర‌ధానంగా డ‌బ్బు వ‌స్తున్న‌ది ఈ ప్రోగ్రామ్ వ‌ల్లే. సినిమాలు లేవు. అట్టాహాసంగా ప్రారంభించిన భార‌తీయుడు 2 ఆగిపోయింది. బిగ్‌బాస్ వ‌ల్ల క‌మ‌ల్‌కి భారీగా ముడుతోంది. ఏడాదిలో రెండున్న‌ర నెల‌ల పాటు వారానికి రెండు రోజులు కేటాయిస్తే కోట్లు వ‌చ్చేస్తున్నాయి. అందుకే న‌య‌న‌తార‌ని తీసుకునే వారి ప్ర‌య‌త్నాల‌కి క‌మ‌ల్ చెక్ పెట్టాడు. 

క‌మ‌ల్‌హాస‌న్ మూడో సీజ‌న్‌కి కూడా బిగ్‌బాసే అని రియాల్టీ షో నిర్వ‌హకులు అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించారు. క‌మ‌ల్‌హాస‌న్ స్థాపించిన పార్టీ మ‌క్క‌ల్ నీది మ‌య్యం ఇటీవ‌ల పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో పోటీ చేసింది. క‌మ‌ల్ పోటీ చేయ‌లేదు కానీ ఆయ‌న పార్టీ అభ్య‌ర్థులు బ‌రిలో నిలిచారు. క‌మ‌ల్ పార్టీ ఏ మాత్ర‌మైనా త‌మిళ రాజ‌కీయాల్లో ప్ర‌భావం చూప‌గ‌ల‌దా అనేది మే 23న తేలుతుంది.